Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్‌లో రాధాకిషన్ రావు పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
- By Gopichand Published Date - 07:39 AM, Sat - 30 March 24

Phone Tapping: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్‌లో రాధాకిషన్ రావు పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. BRS పార్టీకి రాధా కిషన్ రావు అనుకూలంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ పోలీసుల వాహనాల్లో BRS పార్టీ డబ్బులు రాధా కిషన్ రావు తరలించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో వ్యాపారులను బెదిరించి రాధా కిషన్ రావు డబ్బులు కూడా వసూలు చేసినట్లు తెలుస్తోంది. రాధా కిషన్ రావు టీంలో పనిచేసిన మరో నలుగురు టాస్క్‌ఫోర్స్ పోలీసులను కూడా దర్యాప్తు బృందం విచారిస్తుంది. ఈ ట్యాపింగ్ కేసులో మొత్తం 11 మంది కీలకంగా పని చేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో మాజీ డిసిపి రాధా కిషన్ రావు ఉన్నారు.
రెండో రోజు కస్టడీలో అడిషనల్ ఎస్పీలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు రెండో రోజు కస్టడీలో అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగారావును పోలీసులు విచారించనున్నారు. అడిషనల్ ఎస్పీలను ఐదు రోజులపాటు పోలీసులు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటిరోజు కస్టడీలో కేవలం 6 గంటలు మాత్రమే పోలీసులు వారిని విచారించినట్లు తెలుస్తోంది. రాధా కిషన్ రావు ఇచ్చిన సమాచారంతో భుజంగరావు, తిరుపతన్నను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఫోన్ టాపింగ్ కేసులో ఈ ఇద్దరి పాత్ర చాలా కీలకంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Daniel Balaji : ప్రముఖ కోలీవుడ్ విలన్ కన్నుమూత
ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ స్పందన
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ తొలిసారి స్పందించారు. బెడ్‌రూమ్‌లో భార్యభర్తలు మాట్లాడుకునే మాటలను కూడా గత ప్రభుత్వం వినాలనుకుందని సీఎం ఆరోపించారు. ట్యాపింగ్ చేస్తే చర్లపల్లి జైలులో చిప్ప కూడు తినాల్సిందే అన్నారు. కేటీఆర్ ఒకటి, రెండు ఫోన్‌లు ట్యాప్ చేశామని గతంలో అన్న విషయాన్ని గుర్తుచేశారు. కుటుంబ సభ్యుల ఫోన్‌లను ఎవరైనా ట్యాఫ్ చేస్తారా..? అని సీఎం రేవంత్ బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతుందని స్పష్టం చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద దేశంలోనే తొలి ట్యాపింగ్ కేసు కూడా నమోదైంది.
We’re now on WhatsApp : Click to Join