Saudi Woman Jailed : సౌదీ మహిళకు 11 ఏళ్ల జైలు.. ఎందుకో తెలుసా ?
Saudi Woman Jailed : బురఖా ధరించకుండా.. ఆధునిక వస్త్రధారణలో సౌదీ అరేబియా రాజధాని రియాద్ వీధుల్లో నడిచినందుకు 29 ఏళ్ల మనహెల్ అల్-ఒటైబి అనే యువతికి 11 సంవత్సరాల జైలుశిక్ష వేశారు.
- By Pasha Published Date - 08:27 AM, Thu - 2 May 24

Saudi Woman Jailed : బురఖా ధరించకుండా.. ఆధునిక వస్త్రధారణలో సౌదీ అరేబియా రాజధాని రియాద్ వీధుల్లో నడిచినందుకు 29 ఏళ్ల మనహెల్ అల్-ఒటైబి అనే యువతికి 11 సంవత్సరాల జైలుశిక్ష వేశారు. మహిళలకు గార్డియన్‌గా పురుషులు వ్యవహరించే వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే అభియోగాలను కూడా ఆమెపై నమోదు చేశారు. మనహెల్ అల్-ఒటైబి రియాద్‌లో ఫిట్‌నెస్ ట్రైనింగ్ కేంద్రం నడిపేదని.. ఈక్రమంలో ఆమె చాలామంది యువతులకు తన భావజాలాన్ని నూరిపోసి ఉంటుందని సౌదీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేశ కట్టుబాట్లకు వ్యతిరేకంగా నడుచుకోవడం నేరమేనని వారు వాదిస్తున్నారు. వాస్తవానికి సౌదీ అరేబియాలో విధించే శిక్షల వ్యవహారాలు బయటికి రావు. అక్కడి ప్రభుత్వం ఇలాంటి కేసుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతుంది. అయితే మనహెల్ అల్-ఒటైబికి శిక్ష విధించిన అంశంపై సమాచారాన్ని ఇవ్వాలని స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉన్న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం ఇటీవల సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని కోరింది. దానికి బదులిస్తూ.. సౌదీ సర్కారు పంపిన లేఖతో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరిలోనే మనహెల్ అల్-ఒటైబికి జైలు శిక్ష పడిందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join
ఈ కేసులో మనహెల్ అల్-ఒటైబిపై సౌదీ సర్కారు తీవ్రవాద వ్యతిరేక చట్టాన్ని ప్రయోగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసమ్మతిని అణచివేసేందుకు మరీ ఇంత దారుణంగా వ్యవహరించకూడదని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాదిస్తోంది. గతంలో అల్-ఒతైబీ సోదరి ఫౌజియా కూడా ఇలాంటి కేసులను ఎదుర్కొన్నారని.. 2022 సంవత్సరంలో ఈ అంశంపై విచారణకు ఐక్యరాజ్యసమితి పిలిచినా సౌదీ అరేబియా ప్రభుత్వం సహకరించలేదని పేర్కొంది. ‘‘సౌదీ అరేబియాలో మహిళలకు హక్కులు అంతగా లేవు. వారికి స్వేచ్ఛ లేదు. వారి గొంతును నులమడమే అక్కడి ప్రభుత్వం లక్ష్యం’’ అని సౌదీ అరేబియాపై ఆమ్నెస్టీ ప్రచారకర్త బిస్సాన్ ఫకీహ్ ఓ ప్రకటనలో తెలిపారు.
Also Read :Kingmaker : 12 లోక్‌సభ సీట్లతో బీఆర్ఎస్ కింగ్‌మేకర్ అవుతుందా ?
వాస్తవానికి సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ 2017లో పదవిలోకి వచ్చాక మహిళలకు అనుకూలంగా చాలా సంస్కరణలు చేశారు. సౌదీ మహిళలు అప్పటి నుంచి కార్లు నడుపుతున్నారు. పాస్‌పోర్ట్‌లు పొందుతున్నారు. సొంతంగా ప్రయాణిస్తున్నారు. విడాకుల కోసం అప్లై చేయగలుగుతున్నారు. అయినా ఇంకా సౌదీలో మార్చాల్సిన అంశాలు చాలా ఉన్నాయని అమ్నేస్టీ ఇంటర్నేషనల్ వాదిస్తోంది. సౌదీ అరేబియా 2019లో విదేశీ మహిళలకు డ్రెస్ కోడ్ నిబంధనను సడలించింది. అయితే సౌదీ మహిళలు డ్రెస్ కోడ్ నిబంధనలను పాటించాల్సిందే అని స్పష్టం చేసింది.