Nuclear Weapons : మా దేశం జోలికొస్తే అణుబాంబులు వేస్తాం : పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి అమెరికా సహా ఐరోపా దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
- Author : Pasha
Date : 06-06-2024 - 8:25 IST
Published By : Hashtagu Telugu Desk
Nuclear Weapons : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి అమెరికా సహా ఐరోపా దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తమ దేశ సార్వభౌమాధికారానికి ముప్పు కలిగితే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని ఆయన ప్రకటించారు. అణ్వాయుధాలను ప్రయోగించాలనే తపన తమకు లేదని.. ఆ దిశగా పరిస్థితులను క్రియేట్ చేస్తున్నది పశ్చిమ దేశాలే అని పుతిన్ స్పష్టం చేశారు. ‘‘ప్రపంచంలో తొలుత అణ్వాయుధాలను ఉపయోగించింది అమెరికానే.. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై అణుబాంబులు వేసింది అమెరికానే’’ అని ఆయన గుర్తు చేశారు. రష్యా సమగ్రతను కాపాడుకునేందుకు తాము దేనికైనా తెగిస్తామని పుతిన్ తేల్చి చెప్పారు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అంతర్జాతీయ వార్తా సంస్థల సీనియర్ సంపాదకులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ ఈ సంచలన కామెంట్స్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join
రష్యా దేశ అణు సిద్ధాంతం అనేది ఇతర దేశాలను బెదిరించేందుకు అనుమతించదని పుతిన్ తేల్చి చెప్పారు. కేవలం ఇతర దేశాల నుంచి ఇబ్బందులు ఎదురైన సందర్బాల్లోనే అణ్వస్త్రాలను(Nuclear Weapons) వాడాల్సి వస్తుందన్నారు. ‘‘రష్యా అణ్వాయుధాలను వాడదనే అపోహ నుంచి పశ్చిమ దేశాలు బయటికి రావాలి. మా దేశాన్ని కాపాడుకునేందుకు మేం ఏదైనా చేస్తామని వాళ్లు గుర్తుంచుకోవాలి’’ అని పుతిన్ తెలిపారు. రష్యాను కవ్వించే చర్యలను అమెరికా, దాని మిత్రదేశాలు ఆపేయాలన్నారు. లేదంటే తగిన పర్యవసానాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
Also Read :Teenmar Mallanna : విజయం దిశగా తీన్మార్ మల్లన్న.. 6వేలకుపైగా ఓట్ల ఆధిక్యం
నాటో కూటమి దేశాలపై దాడి చేసే ఆలోచనే తమకు లేదని పుతిన్ స్పష్టం చేశారు. సామ్రాజ్యవాద ఎజెండాతో తాము పొరుగుదేశం ఉక్రెయిన్‌పై దాడి చేయలేదన్నారు. ఒకప్పుడు ఉక్రెయిన్ సోవియట్ యూనియన్‌లోనే భాగంగా ఉండేదని ఆయన గుర్తు చేశారు. నాటో కూటమిపై దాడి చేసే ఉద్దేశంతోనే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టిందనే ప్రచారం సరికాదన్నారు. రష్యాకు హాని చేయడానికి ఉక్రెయిన్‌లోని భూభాగాన్ని వాడుకునేందుకు అమెరికా లాంటి దేశాలకు తాము అవకాశం ఇవ్వబోమని పుతిన్ తేల్చి చెప్పారు.