Rohit And Ishan : మీ ఇద్దరికీ ఏమైంది…
ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
- By Naresh Kumar Published Date - 11:41 PM, Thu - 21 April 22

ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు జరగ్గా చెన్నై 19, ముంబై 13 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. అయితే ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు కి ఆదిలోనే కోలుకోలేని షాక్ తగలింది. ముంబై జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ తొలి ఓవర్లోనే పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముఖేష్ చౌదరి వేసిన తొలి ఓవర్ రెండో బంతిని రోహిత్ శర్మ లెగ్ సైడ్ వైపు ఆడగా అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సాంట్నర్ క్యాహ్ అందుకున్నాడు. అలాగే ముఖేష్ చౌదరి వేసిన మొదటి ఓవర్లోనే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ను కూడా డకౌట్ గా పెవిలియన్ చేరాడు.
తొలి ఓవర్ అయిదో బంతికి ఇషాన్ కిషన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి ఓవర్లో కేవలం 6పరుగులు మాత్రమే ఇచ్చిన ముఖేష్ రెండు కీలక వికెట్లు పడగొట్టి ముంబైని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడిగా రోహిత్ శర్మకు ఇషాన్ కిషన్ కు పేరుంది. కానీ ఎందుకో వీరిద్దరూ ఈ సీజన్‌లో యథేచ్చగా బ్యాట్‌ను ఝులుపించలేకపోతున్నారు. టాపార్డర్ లో డెవల్డ్ బ్రెవిస్ మిడిలార్డర్ లో సూర్య కుమార్ యాదవ్ , తిలక్ వర్మ రాణిస్తున్నప్పటికీ ఓపెనర్లు రోహిత్ శర్మ , ఇషాన్ కిషన్ మాత్రం దారుణంగా విఫలమవునున్నారు. దీంతో అభిమానులు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ పై మీమ్స్, ట్రోల్స్‌తో రెచ్చిపోయారు. ఏమైంది రోహిత్ శర్మ నీకు.. ఎందుకిలా ఆడుతున్నావు.. పరుగులు కోసం రోహిత్ శర్మ తెగ కష్టపడాల్సి వస్తోంది’.. అలాగే ఇషాన్ కిషన్ ఇంకా మెగా వేలం మైకంలోనుంచి బయటకు రానట్టున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు అభిమానులు మరో అడుగు ముందుకేసి రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ వల్ల ముకేశ్ అంబానీకి 31 కోట్లు నష్టం అంటూ మండిపడుతున్నారు.
ఐపీఎల్ 2022 మెగా వేలం ముంగిట ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను 16 కోట్లకు రిటైన్ చేసుకోగా, ఇషాన్ కిషన్ ను మెగా వేలంలో 15 కోట్లకు దక్కించుకుంది. ఈ సీజన్ లో వీరిద్దరూ ఒక్క మ్యాచ్ లో కూడా చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో సోషల్ మీడియాలో ముంబై ఆటతీరుతో పాటు రోహిత్ , ఇశాన్ కిషన్ బ్యాటింగ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.