Red Fort: రేపు ఎర్రకోట మూసివేత.. పర్యాటకులెవరూ రావద్దు
ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి
- Author : Praveen Aluthuru
Date : 13-07-2023 - 8:18 IST
Published By : Hashtagu Telugu Desk
Red Fort: ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. దీంతో ఇప్పటికే అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో స్కూల్స్, కాలేజీలు ఆదివారం వరకు తెరుచుకోబడవు. ఇదిలా ఉండగా ఢిల్లీలోని ఎర్రకోటను జూలై 14న మూసివేయనున్నట్టు భారత పురావస్తు సర్వే (ASI) అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్పారు.
యమునా నదీ భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఢిల్లీలోని ఆయా ప్రాంతాలు నీటమునిగాయి. వరదలు రోడ్లపైకి చేరాయి. ఈ క్రమంలో వరదలు ఎర్రకోటపై వ్యాపించాయి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఈ ప్రసిద్ధ కోట ఢిల్లీలోని యమునా నదికి సమీపంలో ఉంది. ఇక రాజ్‌ఘాట్, పురానా ఖిలా ప్రాంతాల్లో కూడా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది.