Ayodhya: అయోధ్యలో రామమందిరం వచ్చే ఏడాదిలో అందుబాటులోకి
- By Hashtag U Published Date - 11:48 AM, Fri - 23 June 23

ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలో రామమందిరం వచ్చే ఏడాది జనవరి 24 నుంచి భక్తుల కోసం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జనవరి 14 నుంచి పది రోజుల పాటు పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మూడంతస్తుల ఈ దేవాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర తెలిపారు. రామ్ లల్లాను గర్భగుడిలో ప్రతిష్ఠించి “ప్రాణ ప్రతిష్ఠ” చేయడానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను మకర సంక్రాతి రోజున ప్రారంభిస్తామని వెల్లడించారు.
పది రోజులపాటు ఆ తంతు కొనసాగుతుందని పేర్కొన్నారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ జరిగే అవకాశముందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానించనుంది. ముగ్గురు శిల్పులు మూడు వేర్వేరు చోట్ల రామ్ లల్లా విగ్రహాలను తయారు చేస్తున్నారని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. అందులో అత్యంత ఆకర్షణీయంగా ఉన్న విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠిస్తామని వెల్లడించారు.