Gaza War : యుద్ధం తర్వాత గాజాపై నియంత్రణ మాదే : నెతన్యాహు
Gaza War : గాజాపై ఓ వైపు వైమానిక దాడులు, మరోవైపు భూతల దాడులను ఇజ్రాయెల్ ఆర్మీ ఉధృతం చేసింది.
- By Pasha Published Date - 10:58 AM, Mon - 13 November 23

Gaza War : గాజాపై ఓ వైపు వైమానిక దాడులు, మరోవైపు భూతల దాడులను ఇజ్రాయెల్ ఆర్మీ ఉధృతం చేసింది. ఇప్పటికే దాదాపు 12వేల మంది గాజా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. గాజా సెంట్రల్‌లోని ప్రధాన ఆస్పత్రులను ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు చుట్టుముట్టాయి. దీంతో గాజాలో వైద్య వ్యవస్థ స్తంభించి, ఎంతోమంది ప్రజల ప్రాణాలు గాల్లోదీపాల్లా మారాయి. ఈతరుణంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన విడుదల చేశారు. గాజాపై యుద్ధం ముగిసిన తర్వాత.. గాజాలో హమాస్‌ను పూర్తిగా అంతం చేసిన తర్వాత తాము చెప్పిన విధంగా పాలస్తీనాలో పాలన సాగాలని స్పష్టం చేశారు. పాలస్తీనా అథారిటీ అనేది ప్రస్తుత రూపంలో ఉండకూడదని, అదెలా ఉండాలనేది తామే నిర్ణయిస్తామని నెతన్యాహు వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘గాజాను ఆయుధ రహితంగా చేయాలి. అప్పుడే ఇజ్రాయెల్‌కు భద్రత ఉంటుంది. గాజాను ఆయుధ రహితంగా చేసే పనిని పాలస్తీనా అథారిటీ సహా అక్కడున్న ఏ సంస్థ కూడా చేయలేదు’’ అని ఆయన చెప్పారు. యుద్ధం తర్వాత గాజాకు సంబంధించిన మొత్తం సైనిక బాధ్యత ఇజ్రాయెలే చేపడుతుందని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ అవసరమైనంత కాలం గాజా భద్రతను పర్యవేక్షిస్తుందని తేల్చి చెప్పారు. గాజాలోకి ఎప్పుడైనా ప్రవేశించే వాతావరణాన్ని తాము కోరుకుంటున్నామని నెతన్యాహు తెలిపారు. గాజాలో హమాస్ మిలిటెంట్ల చెరలో ఉన్న యూదు బందీల విడుదల విషయంలో ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని, అయితే ఇంకా దానిపై క్లారిటీ రాలేదని(Gaza War) చెప్పారు.