Disqualification Petition : తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఎన్సీపీ అనర్హత పిటిషన్లు.. నెక్స్ట్ ఏమిటి ?
Disqualification Petition : మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్‌తో పాటు మంత్రులుగా ప్రమాణం చేసిన మరో ఎనిమిది మందిపై అనర్హత వేటు వేయాలంటూ ఎన్‌సీపీ పిటిషన్లు దాఖలు చేసింది.
- Author : Pasha
Date : 03-07-2023 - 7:46 IST
Published By : Hashtagu Telugu Desk
Disqualification Petition : మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్‌తో పాటు మంత్రులుగా ప్రమాణం చేసిన మరో ఎనిమిది మందిపై అనర్హత వేటు వేయాలంటూ ఎన్‌సీపీ పిటిషన్లు దాఖలు చేసింది. ఈవిషయాన్ని మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ ప్రకటించారు. “వాళ్ల (తిరుగుబాటు ఎమ్మెల్యేల) చర్య చట్టవిరుద్ధం. వారు శరద్ పవార్‌ను, పార్టీని మోసగించి ఈ పని చేశారు. దీనిపై జయప్రకాష్ దండేగావ్కర్ నేతృత్వంలోని పార్టీ క్రమశిక్షణా కమిటీకి కూడా ఫిర్యాదు చేశాం. ఎన్‌సీపీ క్రమశిక్షణా సంఘం సిఫారసు మేరకు తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర శాసనసభకు మెయిల్ (Disqualification Petition) పంపాం. వీలైనంత త్వరగా విచారణ జరపాలని కోరాం” అని జయంత్ పాటిల్ చెప్పారు. త్వరలోనే నేరుగా స్పీకర్ రాహుల్ నర్వేకర్‌ను కలిసి దీనికి సంబంధించిన భౌతిక కాపీని కూడా అందిస్తామన్నారు. ఇదే అంశంపై భారత ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదును పంపామని ఆయన చెప్పారు. పార్టీ విధానానికి వ్యతిరేకంగా వెళ్ళిన క్షణం, వారు సాంకేతికంగా అనర్హులు అని పాటిల్ స్పష్టం చేశారు. “పార్టీ విప్ ముఖ్యం అని సుప్రీంకోర్టు ఇటీవలి ఇచ్చిన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. ఎమ్మెల్యేల సంఖ్య ముఖ్యం కాదు. కాబట్టి, జితేంద్ర అవద్‌ను పార్టీ అధికారిక విప్‌గా పరిగణిస్తారు. ఇది ఎమ్మెల్యేలందరికీ వర్తిస్తుంది” అని రాష్ట్ర NCP చీఫ్ జయంత్ పాటిల్ తేల్చి చెప్పారు.
Also read : Fish Omelette Rolls: ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఆమ్లెట్ రోల్స్.. తయారు చేయండిలా?
న్యాయ పోరాటం చేయం.. జనంలోకి వెళతాం : శరద్ పవార్
NCPకి చెందిన 53 మంది ఎమ్మెల్యేలలో కనీసం 37 మంది పార్టీ ఫిరాయించి.. బీజేపీ-శివసేన ప్రభుత్వంతో చేతులు కలిపారు. అయితే తాను న్యాయ పోరాటం చేయనని, దానికి బదులుగా నేరుగా ప్రజల వద్దకు వెళతానని 82 ఏళ్ల NCP చీఫ్ శరద్ పవార్ వెల్లడించారు. మహారాష్ట్ర క్యాబినెట్ లో చేరిన 9 మంది NCP ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఎన్‌సీపీ పిటిషన్లు దాఖలు చేసిన కొన్ని గంటల తర్వాత శరద్ పవార్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. “ఈ విషయంలో చట్టబద్ధంగా పోరాడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఎన్‌సీపీ యాజమాన్యాన్ని క్లెయిమ్ చేసినా నాకు ఎలాంటి సమస్యలు లేవు. ప్రజల వద్దకు వెళ్లి మద్దతు తీసుకుంటాం. వారు మాకు మద్దతిస్తారనే నమ్మకం నాకు ఉంది” అని శరద్ పవార్ అన్నారు.
అజిత్ ఎప్పుడూ నా అన్నయ్యగానే ఉంటాడు : సుప్రియా సూలే
ఇక ఈ పరిణామాలపై NCP చీఫ్ శరద్ పవార్ కుమార్తె, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే స్పందించారు. “షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంలో అజిత్ పవార్ చేరడం బాధాకరం. అయితే ఆయనతో మా బంధం అలాగే ఉంటుంది. అజిత్ ఎప్పుడూ నా అన్నయ్యగానే ఉంటాడు. ఇక నేను పార్టీ పునర్నిర్మాణంపై ఫోకస్ చేస్తాం” అని సుప్రియా సూలే చెప్పారు.