House Tax: పిఠాపురంలో మున్సిపల్ అధికారులు ఓవరాక్షన్..!
- By HashtagU Desk Published Date - 01:43 PM, Mon - 21 March 22

ఆంధ్ర్రప్రదేశ్‌లో మున్సిపల్ అధికారులు చేస్తున్న ఓవరాక్షన్ పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. తూర్పుగోదావరి జిల్లా, కాకినాడకు సమీపంలో ఉన్న పిఠాపురంలో ఇంటిపన్ను కట్టలేదని అక్కడి మున్సిపల్ అధికారులు, ఇంట్లో మనుషులు ఉండగానే తాళాలు వేయడం హాట్ టాపిక్‌గా మారింది.
దీంతో ఇంటిపన్ను కట్టలేదని అధికారులు ఇలా చేస్తారా అంటూ అక్కడి స్థానికులు మండిపడుతున్నారు. పిఠాపురం పట్టణంలోని 15వ వార్డులో మోహన్ నగర్‌లో పన్ను వసూళ్లకు వెళ్లిన అధికారులు పన్ను చెల్లించలేదనే కారతో ఇళ్లలో మహిళలు ఉండగానే గేటుకు తాళాలు వేశారు. దీంతో ఇంట్లో మహిళలు ఆందోళన చేయడంతో తాళాలు తొలగించి సీలును మాత్రం అలానే ఉంచి వెళ్లిపోయారు.
ఇకపోతే ఇంటి పన్నులు చెల్లించకపోతే నెలవారి వచ్చె పెన్షన్లలో కూడా కోత విధిస్తామని అధికారులు,సచివాలయ సిబ్బంది బెదరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. గతంలో కంటే ఈసారి ఇంటి పన్నులు భారీగా వచ్చాయని దీంతో పన్ను చెల్లించేందుకు గడువు ఇవ్వాలని కోరానా అధికారులు పట్టించుకోవడంలేదని అక్కడి స్థానికులు చెప్పారు. ఇక ఈ విషయం తెలిసిన టీడీపీ నేతలు అక్కడి పరిస్థితులను పరిశీలించి, టీడీపీ జెండాలు ఉన్న ఇళ్ళపై కక్ష్య సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించడం గమనార్హం. ఏది ఏమైనా సామాన్యుల విషయంలో మున్సిపల్ అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారని సర్వత్రా చర్చించుకుంటున్నారు.