AP Bifurcation : ప్రత్యేక హోదాపై కేంద్రంలో కదలిక
ప్రత్యేక హోదాపై కేంద్రం ఈ నెల 17న చర్చించడానికి సిద్దం అయింది.
- Author : CS Rao
Date : 12-02-2022 - 4:50 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రత్యేక హోదాపై కేంద్రం ఈ నెల 17న చర్చించడానికి సిద్దం అయింది. ఏపీ రాష్ట్ర విభజన అనంతరం పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఈ సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీ నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అంశాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. ఏయే అంశాలు చర్చించాలన్న విషయంపై అధికారులకు కేంద్ర హోంశాఖ ఇప్పటికే సమాచారం అందించింది. షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన, ఆస్తుల పంపకాలపై చర్చ జరుపుతామని తెలిపింది. అలాగే, ఆర్థికపరమైన అంశాలపై చర్చ జరగనుంది. కాగా, విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 8న జరిగిన సమావేశంలో కేంద్ర హోం శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్‌ఎస్ రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణారావు ఉన్నారు. ప్రధాని మోడీ పార్లమెంట్ లో విభజన అంశంపై ప్రస్తావించిన తరువాత జరుగుతున్న ఈ మీటింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది.