Hyderabad: జూన్ 15న ఇందిరాపార్కు దగ్గర మహాధర్నా
- By Balu J Published Date - 09:29 PM, Sat - 8 June 24

Hyderabad: జూన్ 15న ఇందిరాపార్కు దగ్గర తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం భువనగిరిలోని SV హోటల్ లో వివిధ బీసీ కుల, సంఘాలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం..కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాష్టంలో సమగ్ర కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకోవాలని కాంగ్రెస్ పెద్దలు చూడటం అత్యంత దుర్మార్గం అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేసి, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్తే బీసీలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెబుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని రాహుల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పినందుకే..కాంగ్రెస్ పార్టీకి 99 ఎంపీ సీట్లు దక్కిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
గతంలో బీసీలను మోసం చేసినందుకే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా మరోసారి బీసీలను మోసం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నారని, అదే జరిగితే.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా పోతుందని అన్నారు. ఇప్పటికైనా అసెంబ్లీలో కులగణన బిల్లు ప్రవేశపెట్టి, చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. కులగణనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన బీహార్ రాష్ట్రాన్ని మోడల్ గా తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. అవసరమైతే కులగణన విధివిధానాల కోసం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని అన్నారు. ఏది ఏమైనా..కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసేలా బీసీ జనసభ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. ఇక, ఈ నెల 15న ఇందిరాపార్కు దగ్గర బీసీ జనసభ తలపెట్టిన మహాధర్నాకు వివిధ బీసీ కుల, సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి.