Delhi: ఎల్లో అలర్ట్‌తో అమల్లోకి రానున్న ఆంక్షలివే..
- Author : hashtagu
Date : 28-12-2021 - 4:58 IST
Published By : Hashtagu Telugu Desk
కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. దిల్లీ వ్యాప్తంగా ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసిన సర్కారు.. మరిన్ని ఆంక్షలను విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గత కొన్ని రోజులుగా దిల్లీలో పాజిటివిటీ రేటు 0.5శాతం కంటే ఎక్కువగా ఉంటోంది. అందువల్ల, వైరస్ కట్టడికిగానూ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవల్ -1(ఎల్లో అలర్ట్)ను అమలు చేయాలని నిర్ణయించాం. మరిన్ని ఆంక్షలు విధిస్తాం అని కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం దిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. బాధితుల వ్యాధి తీవ్రత స్వల్పంగానే ఉందని ఆయన అన్నారు. ఆక్సిజన్ వినియోగం, వెంటిలేటర్ల అవసరం కూడా పెరగలేదన్నారు. అయితే ప్రజలంతా తప్పకుండా కొవిడ్ నిబంధనలను పాటించాలని, మాస్క్‌లు, భౌతికదూరం జాగ్రత్తలు పాటించాలని కేజ్రీవాల్ కోరారు.
ఎల్లో అలర్ట్‌తో అమల్లోకి రానున్న ఆంక్షలివే..
* ప్రైవేటు కార్యాలయాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 50శాతం సామర్థ్యంతో నిర్వహించేందుకు అనుమతి ఉంటుంది.
* సినిమా హాళ్లు, మల్టిప్లెక్స్‌లు, ఆడిటోరియంలను పూర్తిగా మూసివేస్తారు.
* జిమ్‌లు, స్పా సెంటర్లు, యోగా ఇనిస్టిట్యూట్‌లు మూతబడుతాయి.
* స్కూళ్లు, విద్యా సంస్థలు, కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లు తెరవడానికి అనుమతి లేదు.
* సామాజిక, రాజకీయ, మతపరమైన సామూహిక కార్యక్రమాలు, సభలు, సమావేశాలపై నిషేధం ఉంటుంది.
* హోటళ్లు తెరుచుకోవచ్చు. అయితే బాంకెట్ హాల్స్, కాన్ఫరెన్స్ హాళ్లను తెరిచేందుకు వీల్లేదు.
* రెస్టారంట్లను 50శాతం సామర్థ్యంతో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు తెరుచుకోవచ్చు. బార్లు 50శాతం సామర్థ్యంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరవాలి.
* దిల్లీ మెట్రో 50శాతం సామర్థ్యంతో నడుస్తుంది. మెట్రోలో నిల్చుని ప్రయాణం చేసేందుకు అనుమతి లేదు.
* ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించే బస్సులను కూడా 50శాతం సామర్థ్యంతో నడపాలి.
* ఆటోలు, టాక్సీలు, ఈ-రిక్షాల్లో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి.
* క్రీడా ప్రాంగణాలు, స్టేడియంలు, స్విమ్మింగ్ పూల్స్‌ను మూసివేయాలి.
* పబ్లిక్ పార్కులు తెరిచే ఉంటాయి.
* అవుట్‌డోర్ యోగాకు అనుమతి ఉంది. సెలూన్లు, బ్యూటీ పార్లర్లు తెరుచుకోవచ్చు.
* అత్యవసరం కాని మాల్స్, దుకాణాలు సరి-బేసి పద్ధతిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరుచుకోవాలి.
* రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
* పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో 20 మంది మాత్రమే పాల్గొనాలి.
दिल्ली में कोरोना संक्रमण की मौजूदा स्थिति पर महत्वपूर्ण प्रेस कॉन्फ़्रेंस | LIVE https://t.co/BFIs9ERcQi
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 28, 2021