Atchannaidu: ప్రభుత్వ విధానాలతోనే చేనేతల ఆత్మహత్యలు!
ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప.. ప్రజల్ని ఉద్దరించే పనులు ఏమాత్రమూ చేయడం లేదని చెప్పడానికి కృష్ణా జిల్లా పెడనలో అప్పుల బాధతో కుటుంబ ఆత్మహత్యే నిదర్శనమని
- By Balu J Published Date - 01:12 PM, Tue - 1 February 22

ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప.. ప్రజల్ని ఉద్దరించే పనులు ఏమాత్రమూ చేయడం లేదని చెప్పడానికి కృష్ణా జిల్లా పెడనలో అప్పుల బాధతో కుటుంబ ఆత్మహత్యే నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వయసు మళ్లిన తల్లిదండ్రులతో పాటు పాతికేళ్లు కూడా నిండని యువకుడు కూడా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని, చేనేతలను ఉద్దరించేశామంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం తప్ప.. చేనేతలకు చేసిందేమీ లేదనడానికి తాజా ఘటనే నిలువెత్తు సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేనేతలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీలు, రుణాలు, వడ్డీ రాయితీలు అందేవి. సొంత మగ్గం లేకపోయినా.. ప్రభుత్వం తరఫున రిబేటు సహా సగటున ఒక్కో కార్మికుడికి ఏడాదికి రూ.లక్ష వరకు సహాయం అందేది అని అచ్చెన వైసీపీ ప్రభుత్వానికి గుర్తు చేశారు.
నూలు, రంగులు ఇతర వస్తువులపై సబ్సిడీలు అందేవనీ, ఆప్కో ద్వారా అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే నేడు నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కరోనా వలన చేనేత కార్మికులు నేసిన వస్త్రాలు కొనుగోళ్లకు నోచుకొక కార్మికులు అవస్థలు పడుతున్నా.. కొనుగోలు చేయాలనే కనీస ఆలోచన కూడా ప్రభుత్వం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, బాధిత కుటుంబానికి అండగా నిలవాలి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.