Janasena : జనసేన పోటీ చేసే సీట్ల జాబితా..?
- Author : Kavya Krishna
Date : 07-03-2024 - 12:37 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్ర ప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో అందరి చూపు టీడీపీ (TDP)- జనసేన (Janasena) కూటమిపైనే ఉంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వచ్చే ఎన్నికల్లో భారీ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమని.. అంతేకాకుండా.. సీఎం అభ్యర్థి కూడా పవనే అంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. బాబు అరెస్ట్ తరువాత టీడీపీ- జనసేన కూటమి ఏర్పడనున్నట్లు ప్రకటించిన జనసేనాని అధిక సీట్లను ఆశిస్తుందని భావించారు. కానీ దానికి భిన్నంగా తొలి విడత అభ్యర్థుల జాబితాలో 24 సీట్లనే జనసేన పార్టీకి కేటాయించడంతో రెండు పార్టీల్లోనూ గందరగోళం నెలకొంది. మాకు అనుకున్న స్థానాల్లో సీట్లు రాలేదని జనసైనికులు అంటుంటే.. మా సీట్లు జనసైనికులకు ఎలా ఇస్తారని తెలుగు తమ్ముళ్లు గరం అవుతున్నారు. అయితే ఈ పరిణామాల నడుమ తాజాగా పవన్ కల్యాణ్ ఉండవల్లి నివాసంలో చంద్రబాబు నాయుడుతో సమావేశమై సీట్ల పంపకం, రెండో జాబితా అభ్యర్థులపై మేధోమథనం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
పొత్తులో భాగంగా జనసేనకు వచ్చే సీట్లు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీని ప్రకారం కాపు సామాజికవర్గం ప్రభావంతో రాష్ట్రంలోనే అత్యధికంగా గోదావరి జిల్లాల్లో (తూర్పు:5, పశ్చిమ:6) పదకొండు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. వైజాగ్‌లో నాలుగు, కృష్ణాలో రెండు రానుంది. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కడపలలో కూడా జనసేనకు ఒక్కొక్కటి దక్కనుంది. పశ్చిమగోదావరిలో భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, నిడదవోలు, పోలవరం (ఎస్టీ)లో జనసేన బరిలోకి దిగనుంది. తూర్పులో కాకినాడ రూరల్, రాజోలు (ఎస్సీ), రాజానగరం, అమలాపురం/పి గన్నవరం, పిటాపురం స్థానాలు ఆ పార్టీకి దక్కుతాయి. విశాఖపట్నం జిల్లాలో వైజాగ్ సౌత్, పెందుర్తి/మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గాల నుంచి పార్టీ బరిలోకి దిగనుంది. కృష్ణాలో విజయవాడ పశ్చిమ, అవనిగడ్డలో ఆ పార్టీకి అభ్యర్థులు ఉంటారు. మిగిలిన స్థానాలు శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ (ఎస్టీ), విజయనగరం జిల్లా నెలిమర్ల, గుంటూరు జిల్లా తెనాలి, ప్రకాశం జిల్లా దర్శి, చిత్తూరు జిల్లా తిరుపతి, అనంతపురం జిల్లా అనంతపురం, కడప జిల్లాలోని రైల్వే కోడూరు.
Read Also : Shiva Temples: మహాశివరాత్రిని ఘనంగా జరుపుకునే ప్రముఖ దేవాలయాలు ఇవే..!