Israel Vs Lebanon : లెబనాన్ రాజధానిపై ఇజ్రాయెల్ ఎటాక్.. హమాస్ కీలక నేత హతం
Israel Vs Lebanon : ఇప్పటికే యెమన్‌లోని హౌతీ మిలిటెంట్లు, గాజాలోని హమాస్ మిలిటెంట్లు, సిరియాలోని ఇరాన్ సమర్ధిత మిలిటెంట్లు, లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్లతో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది.
- By Pasha Published Date - 01:16 PM, Wed - 3 January 24

Israel Vs Lebanon : ఇప్పటికే యెమన్‌లోని హౌతీ మిలిటెంట్లు, గాజాలోని హమాస్ మిలిటెంట్లు, సిరియాలోని ఇరాన్ సమర్ధిత మిలిటెంట్లు, లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్లతో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. అయితే ఇప్పుడు మరో ఆర్మీతోనూ యుద్ధానికి ఇజ్రాయెల్ స్వయంగా తలుపులు తెరుచుకుంది. పొరుగుదేశం లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ ఆర్మీ డ్రోన్ ఎటాక్ చేసింది. ఈ దాడిలో బీరూట్‌లో ఉంటున్న హమాస్ సంస్థ డిప్యూటీ చీఫ్ సాలెహ్ అల్-అరూరి, ఆయన బాడీగార్డ్‌లు చనిపోయారు. దీంతో లెబనాన్ ఆర్మీ కూడా ఇజ్రాయెల్ బార్డర్‌కు పెద్దఎత్తున చేరుకుంది. ఇప్పటికే లెబనాన్‌లో ఉంటున్న హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ బార్డర్ ఏరియాలపై దాడులు చేస్తోంది. ఈ దాడుల ప్రభావంతో దాదాపు 2 లక్షల మంది ఇజ్రాయెలీ యూదులు బార్డర్ ఏరియాలలోని తమ కాలనీలను ఖాళీ చేసి వెళ్లిపోయారు.
We’re now on WhatsApp. Click to Join.
హమాస్ సంస్థ డిప్యూటీ చీఫ్ సాలెహ్ అల్-అరూరి హత్యపై లెబనాన్ తాత్కాలిక ప్రధానమంత్రి నజీబ్ మికాటి(Israel Vs Lebanon) మాట్లాడుతూ.. ‘‘ఇజ్రాయెల్ మా దేశంలోకి చొరబడి మా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసింది. ఇది ఇజ్రాయెల్ చేసిన ఇంకో యుద్ధనేరం. ఈ పరిస్థితుల్లో మేం కూడా ఇజ్రాయెల్‌పై యుద్ధం చేయాల్సి వస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. హమాస్ సంస్థ డిప్యూటీ చీఫ్ సాలెహ్ అల్ అరూరి హత్యపై ఎవరూ మాట్లాడొద్దని తమ దేశానికి చెందిన అందరు మంత్రులకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో దీనిపై మీడియాతో మాట్లాడేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్ హగారి నిరాకరించారు. అయితే తమ దేశం లెబనాన్ బార్డర్‌లో ఎలాంటి ప్రతిఘటనను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.