Vande Sadharan: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వందేభారత్ స్థానంలో వందే సాధారణ్..?
వందే భారత్ ఛార్జీలు ఎక్కువగా ఉంటున్నాయని ప్రయాణికుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. దీంతో స్లీపర్ సౌకర్యంతో, ప్రజల ప్రయాణాన్ని తక్కువ ఖర్చుతో చేసేలా త్వరలోనే వందే సాధారణ్ (Vande Sadharan) రైళ్లను ప్రవేశపెట్టబోతున్నారు.
- Author : Gopichand
Date : 12-07-2023 - 7:35 IST
Published By : Hashtagu Telugu Desk
Vande Sadharan: భారతీయులకు, భారతీయ రైల్వేకు విడదీయరాని అనుబంధం ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తూ ప్రయాణికులను ఆకట్టుకోవడంలో రైల్వే ముందుంది. ఎక్కువ దూరాన్ని సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో సురక్షితంగా ప్రయాణం ఉండటంతో ప్రజంతా మొదటి ప్రాధాన్యత కింద రైలునే ఎంపిక చేసుకుంటారు. ఇటీవలే సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే.
వందే భారత్ కు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. ఆక్యుపెన్సీ కూడా ఊహించని విధంగా ఉండటంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో వందే భారత్ ఛార్జీలు ఎక్కువగా ఉంటున్నాయని ప్రయాణికుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. దీంతో స్లీపర్ సౌకర్యంతో, ప్రజల ప్రయాణాన్ని తక్కువ ఖర్చుతో చేసేలా త్వరలోనే వందే సాధారణ్ (Vande Sadharan) రైళ్లను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రైళ్లు రూ.65 కోట్ల అంచనా వ్యయంతో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి. తొలి రైలు ఈ ఏడాది చివరలో పట్టాలెక్కే అవకాశం ఉంది.
Also Read: Miss Netherlands: ‘మిస్ నెదర్లాండ్స్ 2023’ టైటిల్‌ను గెలుచుకున్న ట్రాన్స్ జెండర్
ఇందులో మొత్తం 24 బోగీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బోగీలన్నీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లే ఉంటాయి. అలాగే రెండు లోకోమోటివ్స్ ఉంటాయి. ఈ రైళ్లలో బయో వాక్యూమ్ టాయ్‌లెట్స్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఛార్జింగ్ పాయింట్ సౌకర్యాలను కల్పిస్తున్నారు. వీటితో పాటు ప్రతి కోచ్‌లో సీసీటీవీ కెమెరా, ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ కూడా కల్పించనున్నారు. సాధారణ రైళ్లకు ఉండే ఛార్జీలే వందే సాధారణ్ ట్రైన్స్‌లోనూ వర్తించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. వందే సాధరణ్ రైళ్ల టికెట్ల ధరలు ఎంత ఉంటాయన్నది ప్రస్తుతానికి తెలియదు. వీటి వేగం ఎలా ఉంటుంది అన్నది కూడా తెలియదు. రైలు వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.