India Reports: ఇండియాలో మళ్లీ కరోనా వ్యాప్తి!
కరోనా మహమ్మారి ఇప్పట్లో వదిలేలా లేదు. దాని జోరు తగ్గిందన్న మాట వాస్తవమే కాని.. పూర్తిగా మాత్రం కనుమరుగు కాలేదు.
- By hashtagu Published Date - 03:24 PM, Thu - 2 June 22

కరోనా మహమ్మారి ఇప్పట్లో వదిలేలా లేదు. దాని జోరు తగ్గిందన్న మాట వాస్తవమే కాని.. పూర్తిగా మాత్రం కనుమరుగు కాలేదు. అందుకే ఇప్పుడు మళ్లీ తన పంజా విసిరింది. ఫిబ్రవరి తరువాత కేసుల పెరుగుదలలో పెద్దగా ఇబ్బంది లేదు కదా అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న వేళ మరోసారి తన ఉనికిని బలంగాచాటుకుంటోంది. ఎందుకంటే కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం వరకు 2,745 కేసులు ఉండడంతో ఫరావాలేదులే అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఒక్కరోజే దాదాపు 1000 కేసులు పెరిగి.. ఆ నెంబర్ కాస్తా 3000 దాటేసింది. ఈ అంకెలతో దేశంలో క్రియాశీల కేసులు 19,000 దాటాయి. దీంతో ప్రజల్లో కాస్త ఆందోళన కనిపించింది. పైగా దేశానికి ఆర్థిక రాజధాని ముంబైలో పాజిటివిటీ రేటు 8.4 శాతానికి చేరుకుంది. ఈమధ్యనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి థాకరే కూడా ప్రజలు మాస్క్ వేసుకోవాలని కోరారు. పాజిటివిటీ రేటు పెరుగుతోందని.. అందుకే అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని.. మాస్క్ తప్పనిసరి అని చెప్పారు. కానీ చాలామంది దానిని పట్టించుకోకపోవడంతో అక్కడ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీనివల్ల ఒక్క రోజులో అక్కడ 739 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి ఒకటి తరువాత ఇవే అత్యధిక కేసులు.
దేశంలో కరోనా నిబంధనలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఎత్తేశాయి. అయినా సరే.. మాస్కు వేసుకోవాలని.. నిబంధనలు స్వచ్ఛందంగా పాటించాలని ప్రధాని మోదీ మొదలు చాలామంది నిపుణులు కూడా చెప్పారు. కానీ కొంతమంది దానిని సీరియస్ గా తీసుకోలేదు. అందుకే క్రియాశీల కేసుల వాటా 0.05 శాతానికి పెరిగింది. ఈ నెంబర్ ఇలాగే పెరిగితే.. మళ్లీ కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.