Ukraine Russia War: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్ దూరం
- By HashtagU Desk Published Date - 03:48 PM, Sat - 26 February 22

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన నేపధ్యంలో(UNSC), తాజాగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మరోసారి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఉక్రెయిన్‌లో రష్యా చర్యలపై యూఎన్ఎస్‌సీ నిర్వహించిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమయింది. రష్యా దాడిని ఖండిస్తూ భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. మండలిలోని మొత్తం 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశాయి.
అయితే మొదటి నుంచి ఉక్రెయిన్, రష్యా వివాదంలో తటస్థంగా ఉన్న భారత్‌తో పాటు చైనా, యూఏఈలు ఈ ఓటింగ్‌లో పాల్గొనలేదు. భద్రతా మండలిలో ఐదు శాశ్వత దేశాల్లో ఒకటైన రష్యా తన వీటో అధికారాన్ని ఉపయోగించి ముసాయిదాను తిరస్కరించింది. ఐరాసలో భారతరాయబారి టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ.., ఉక్రెయిన్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాల పట్ల భారత్ తీవ్ర ఆందోళనకు గురవుతోందని అన్నారు. కీవ్‌లోని ఆర్మీ సైనిక స్థావరంపై ఈ రోజు రష్యా దాడికి చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్ మొత్తాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా మూడో రోజు కూడా రష్యా ఆ దేశం పై దాడులు కొనసాగిస్తుంది. ఉక్రెయిన్‌లో రష్యా చేస్తోన్న దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కలచివేసేలా ఉండడంతో వాటిని షేర్ చేయకూడదని తమ ప్రజలకు ఉక్రెయిన్ ప్రభుత్వం సూచించింది.