ICC Women’s World Cup 2025: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల
ICC Women’s World Cup 2025: 2025 మహిళల వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అధికారికంగా విడుదల చేసింది.
- By Kavya Krishna Published Date - 06:27 PM, Mon - 16 June 25

ICC Women’s World Cup 2025: 2025 మహిళల వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి. భారత్ జట్టు తమ ప్రపంచ కప్ ప్రయాణాన్ని సెప్టెంబర్ 30న బెంగళూరులో శ్రీలంకతో తొలి మ్యాచ్‌తో ప్రారంభించనుంది.
ఈ వరల్డ్ కప్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మ్యాచ్ భారత్ vs పాకిస్థాన్. అక్టోబర్ 5న శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ హై-వోల్టేజ్ పోరు జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడి, దానిని అనుసరించిన భారత్ వైమానిక దాడుల నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఇది తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.
పాకిస్థాన్ జట్టుకు ఐసీసీ న్యూట్రల్ వేదికగా కొలంబోను కేటాయించింది. అక్కడ మొత్తం 11 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. శ్రీలంక జట్టు ఈ వేదికపై నాలుగు హోం మ్యాచ్‌లు ఆడనుంది. సెమీ ఫైనల్స్ (అక్టోబర్ 29), ఫైనల్ (నవంబర్ 2) మ్యాచ్‌లు కూడా కొలంబోలో జరగనున్నాయి. అయితే, పాకిస్థాన్ జట్టు నాకౌట్ దశకు చేరితేనే ఈ మ్యాచ్‌లు అక్కడ జరుగుతాయి, లేకపోతే భారత్‌లో నిర్వహించనున్నారు.
భారత్ లీగ్ మ్యాచ్‌లు షెడ్యూల్:
సెప్టెంబర్ 30: భారత్ vs శ్రీలంక – బెంగళూరు
అక్టోబర్ 5: భారత్ vs పాకిస్థాన్ – కొలంబో
అక్టోబర్ 9: భారత్ vs దక్షిణాఫ్రికా – విశాఖపట్నం
అక్టోబర్ 12: భారత్ vs ఆస్ట్రేలియా – విశాఖపట్నం
అక్టోబర్ 19: భారత్ vs ఇంగ్లాండ్ – ఇండోర్
అక్టోబర్ 23: భారత్ vs న్యూజిలాండ్ – గౌహతి
అక్టోబర్ 26: భారత్ vs బంగ్లాదేశ్ – బెంగళూరు
ఈ టోర్నమెంట్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో సాగనుంది. అన్ని జట్లు ఒకదానితో ఒకటి పోటీపడి పాయింట్ల పట్టికలో టాప్-4 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్స్‌లో మొదటి స్థానంలో ఉన్న జట్టు నాల్గవ స్థానంలో ఉన్న జట్టుతో, రెండో జట్టు మూడో స్థానంలో ఉన్న జట్టుతో తలపడనుంది. విజేతలు నవంబర్ 2న గ్రాండ్ ఫినాలేలో తలపడతారు. 2025 మహిళల వరల్డ్ కప్ భారీ అంచనాల నడుమ జరగనుండగా, భారత్ జట్టు తమ సత్తా నిరూపించేందుకు సిద్ధమవుతోంది.
Tirumala : శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్