Revanth reddy : ప్రధానిని నేను అగౌరవపర్చలేదు : సీఎం రేవంత్
ప్రధాని హోదాను అగౌరవపర్చలేదు. పుట్టుకతోనే ఆయన బీసీ కాదు అని మాత్రమే చెప్పాను. మోడీకి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే జన గణనలో కులగణన చేసి చూపించాలి అని డిమాండ్ చేశారు.
- Author : Latha Suma
Date : 15-02-2025 - 7:00 IST
Published By : Hashtagu Telugu Desk
Revanth reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ప్రధాని మోడీపై కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో సీఎం చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను ప్రధాని నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా దూషించలేదు. ప్రధాని హోదాను అగౌరవపర్చలేదు. పుట్టుకతోనే ఆయన బీసీ కాదు అని మాత్రమే చెప్పాను. మోడీకి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే జన గణనలో కులగణన చేసి చూపించాలి అని డిమాండ్ చేశారు.
Read Also: Cool Drinks: వేసవికాలంలో కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా.. అయితే జాగ్రత్తండోయ్.. ఈ ప్రమాదాలు రావచ్చు!
నా వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి, బండి సంజయ్ వక్రీకరించారు. మోడీకి చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన కూడా చేయాలి. మంత్రివర్గ విస్తరణపై రాహుల్ గాంధీతో చర్చించలేదు. బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు తెస్తాం అని రేవంత్ రెడ్డి అన్నారు. కులగణన ద్వారా ప్రజాసంక్షేమానికి బాటలు వేస్తున్నాం. కులగణన, ఎస్సీ వర్గీకరణలో తెలంగాణ ఒక రోల్ మోడల్. రాహుల్ గాంధీ చెప్పింది నేను కచ్చితంగా చేస్తా. రాష్ట్రంలో కులగణన సమగ్రంగా నిర్వహించాం. ఇందులో వెల్లడైన వివరాల ఆధారంగా భవిష్యత్తులో కమిషన్ గాని కమిటీ గాని వేసి ప్రజలకు ఏ విధంగా సంక్షేమ ఫలాలు చేరువ చేయాలనే దానిపై కసరత్తు చేస్తాం అన్నారు.
తమ నాయకుడు రాహుల్ గాంధీతో తనకు ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. గ్యాప్ ఉన్నట్లు విపక్ష నేతలే క్రియేట్ చేశారని.. అవన్నీ ఊహాగానాలే అని అన్నారు. రాహుల్ గాంధీ గైడెన్స్‌తోనే పనిచేస్తున్నట్లు తెలిపారు. రాహుల్ ఎజెండాను ముఖ్యమంత్రిగా నెరవేర్చడమే నా పని అని వెల్లడించారు. దేశంలో ఎవరూ చేయలేని విధంగా బీసీ కులగనన చేశాం. మిస్ అయిన వారి కోసం మరోసారి కులగణన చేస్తున్నాం. జనం స్వయంగా చెప్పిన వివరాలే రికార్డుల్లో నమోదు చేశాం. కులగణనలో ఒక్క తప్పు ఉన్నా చూపించండి అని విపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.