Ameenpur : ఆక్రమణల వెనుక ఎవరున్నా విడిచిపెట్టాం: హైడ్రా కమిషనర్
చెరువు అలుగులు, తూము మూసేయడంతో వర్షాలు కురిసినప్పుడు పరిసర ప్రాంతాల్లోకి చెరువు నీరు వస్తోందని స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు.
- By Latha Suma Published Date - 08:55 PM, Tue - 19 November 24

Hydra Commissioner AV Ranganath : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈరోజు హైదరాబాద్ శివారులోని అమీన్‌పూర్ పర్యటించారు. ఈ మేరకు ఆయన పెద్ద చెరువు, కొత్త చెరువు, శంభునికుంటను పరిశీలించారు. అక్కడి స్థానికులతో మాట్లాడి ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై ఫిర్యాదులు స్వీకరించారు. స్థానికులతో మాట్లాడిన అనంతరం రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉండటంతో కబ్జాలపై ఫిర్యాదులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయన్నారు. ఈ ఆక్రమణల వెనుక ఎవరున్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. ఇందులో అధికారుల పాత్ర ఉందని తేలినా వారిపై చర్యలు తీసుకుంటాం అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టంచేశారు.
అంతేకాక..అధిక సంఖ్యలో అమీన్ పూర్ పెద్ద చెరువు ఆక్రమణలపై ఫిర్యాదులు అందాయని అన్నారు. చెరువు అలుగులు, తూము మూసేయడంతో వర్షాలు కురిసినప్పుడు పరిసర ప్రాంతాల్లోకి చెరువు నీరు వస్తోందని స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. సాంకేతిక బృందంతో పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి ఆక్రమణలు ఉంటే తొలగిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే ఎ.వి. రంగనాథ్ వైఎస్‌ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు. పద్మావతి లేఔట్ పరిసర ప్రాంతాల్లో ఆయన భూకబ్జాలకు పాల్పడ్డారని స్థానికుల నుండి ఫిర్యాదులు అందాయి. దీనిపై హైడ్రా విచారణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఆక్రమణలు నిజమైతే తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్థానికులకు హామీ ఇచ్చారు.
ఇకపోతే.. హైదరాబాద్ మహా నగరంలోని చెరువులు, స్థలాలు, పార్కులు కబ్జాకు గురి కాకుండా కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ సంస్థకు చట్టబద్దత కల్పించింది. ఈ మేరకు గ్రేటర్‌తో పాటు ఓఆర్ఆర్ వరకు ఉన్న 56 చెరువులు, కుంటలపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-ఎన్ఆర్ఎస్సీ అధ్యయనం ఆధారంగా హైడ్రా ముందుకెళ్తుంది.
Read Also: Pushpa 2 Ticket Price : ఏంటీ…పుష్ప 2 సింగిల్ స్ర్కిన్ టికెట్ ధర రూ.300 ?