VSP: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద భారీ బలగాలు.. నిరసనలకు సిద్ధంగా ఉక్కు కార్మికులు
నేడు విశాఖపట్టణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడి పర్యటించనున్న వేళ ...
- By Hashtag U Published Date - 09:46 AM, Fri - 11 November 22

నేడు విశాఖపట్టణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడి పర్యటించనున్న వేళ … విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, విభజన హామీల సాధన కోసం రాష్ట్రవ్యాప్త నిరసనలకు ప్రజానీకం సన్నద్ధమయ్యింది. విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకాన్ని నిలిపేస్తున్నట్లు మోడి స్పష్టమైన ప్రకటన చేయాలంటూ… స్టీల్ ప్లాంట్ కార్మికులు, నగర ప్రజానీకం ఈరోజు ఉదయం నిరసనలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ మెయిన్‌గేటు వద్దకు ఆందోళనకారులు చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్ వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. నిరసనలను అడ్డుకునేందుకు, అరెస్టులు చేసేందుకు పోలీసులు సన్నద్ధంగా కనబడుతున్నారు. అయితే చెక్కు చెదరని ఉద్యమ పోరాటంతో ఉక్కు కార్మికులు నిరసనలను తెలిపేందుకు సన్నద్ధమయ్యారు.
శుక్ర, శనివారాల్లో నిరసనలు చేపట్టాలని ఇప్పటికే పలు కార్మిక, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఇప్పటికే ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కొనసాగిస్తున్న ఆందోళనలు 635 రోజులకు చేరాయి. విశాఖ నగరమంతా కార్మిక, నగర ప్రజల ఆందోళనలతో, ప్రదర్శనలతో, ధర్నాలతో మారుమోగిపోతోంది. విశాఖ నగరానికి ప్రధాని మోడి వస్తున్న వేళ.. విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకాన్ని నిలిపేస్తున్నట్లు మోడి స్పష్టమైన ప్రకటన చేయాలని స్టీల్ ప్లాంట్ కార్మికులు, నగర ప్రజానీకం డిమాండ్ చేస్తున్నారు.