Harish Rao : కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని అబద్ధాల వేదికగా మార్చారు: హరీష్ రావు
తాము రూ. 4.17 లక్షల కోట్లు అప్పు చేస్తే.. 7 లక్షల కోట్లు అప్పు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.
- By Latha Suma Published Date - 07:49 PM, Mon - 23 December 24

Harish Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హనుమకొండలో దీక్ష చేస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులను కలిశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని అబద్ధాల వేదికగా మార్చారని విమర్శించారు. తాము రూ. 4.17 లక్షల కోట్లు అప్పు చేస్తే.. 7 లక్షల కోట్లు అప్పు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇవ్వలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటడు, స్ప్రింక్లర్లు ఇవ్వలేదంటడు, రుణమాఫీ చేయలేదంటడు. మేం రైతులకు ఇవన్నీ ఇవ్వకపోతే రాజీనామా చేస్తా.. మీరు సిద్ధమా భట్టి విక్రమార్క అని ప్రశ్నిస్తే సమాధానం లేదు అన్నారు.
ఇవాళ ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కేసులు, ప్రజా ప్రభుత్వంలో 7వ గ్యారంటీ పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నదా? పాలసీ మ్యాటర్ అడిగితే హౌస్ అరెస్టు, కేసులు పెడుతున్నారు. సర్వశిక్ష అభియాన్ 1523 ఉద్యోగాలు మేమే ఇచ్చినం, మీ సమస్యల పరిష్కారానికి అండగా ఉంటం. చాయ్ తాగినంత సేపట్లో మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి, ఇప్పటికీ ఈ ముఖ్యమంత్రి చేయలేదన్నారు. అందుకే మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టి, ప్రజల ముందు వారి నిజస్వరూపాన్ని బయట పెట్టాలి అన్నారు. కేసీఆర్ చేసిన పనులన్నీ మీకు అర్ధమవుతున్నాయి. అందుకే నిజం నిలకడ మీద తెలుస్తుందని అని హరీష్ రావు అన్నారు.
సర్వ శిక్ష అభియాన్ ( ఎస్ఎస్ఎ) లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పిన సీఎం రేవంత్.. ఆ దిశగా కార్యాచరణ చేపట్టడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎస్ఏ లో పనిచేస్తున్న పది విభాగాలకు చెందిన ఉద్యోగులు న్యాయంగా తమకు రావాల్సిన సౌకర్యాల కోసం సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూ సమ్మె బాట పట్టారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం కూడా స్పందించకుండా కాలయాపన చేస్తుంది. ఈ నేపథ్యంలో సోమవారం హనుమకొండలో దీక్ష చేస్తున్న సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని హరీశ్‌రావు సందర్శించారు.