GT beats RR: టాప్ లేపిన గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ 15వ సీజన్ లో కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ మళ్ళీ గెలుపు బాట పట్టింది. హ్యాట్రిక్ విజయాల తర్వాత తొలి పరాజయం చవిచూసిన ఆ జట్టు తాజాగా రాజస్థాన్ రాయల్స్ పై 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- By Naresh Kumar Published Date - 11:40 PM, Thu - 14 April 22

ఐపీఎల్ 15వ సీజన్ లో కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ మళ్ళీ గెలుపు బాట పట్టింది. హ్యాట్రిక్ విజయాల తర్వాత తొలి పరాజయం చవిచూసిన ఆ జట్టు తాజాగా రాజస్థాన్ రాయల్స్ పై 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు దూసుకెళ్ళింది. బ్యాటింగ్ లో హార్థిక్ పాండ్యా మెరుపులు, బౌలింగ్ లో ఫెర్గ్యుసన్ , యశ్ దయాల్ రాణించడంతో గుజరాత్ నాలుగో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ 53 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మాథ్యూ వేడ్ 12, శుభ్ మన్ గిల్ 13 , విజయ్ శంకర్ 2 పరుగులకే ఔటయ్యారు.
ఈ దశలో కెప్టెన్ హార్థిక్ పాండ్యా మెరుపు బ్యాటింగ్ తో అదరగొట్టాడు. చాలా రోజుల తర్వాత భారీ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. పాండ్యా , అభినవ్ మనోహర్ నాలుగో వికెట్‌కు కేవలం 55 బంతుల్లో 86 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో ఆరో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక చివరి 4 ఓవర్లలో హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ చెలరేగి ఆడారు. ఫోర్లు, సిక్సులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరు కలిసి 27 బంతుల్లోనే అజేయంగా 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో చివరి 5 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 62 పరుగులు సాధించింది. మిల్లర్ , పాండ్యా దూకుడుతో వీరిద్దరి దూకుడుతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులచేసింది. పాండ్యా 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 87 పరుగులు చేయగా… మిల్లర్ 14 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ దూకుడుగా ఆడే క్రమంలో వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ జాస్ బట్లర్ భారీ షాట్లతో ఆకట్టుకున్నా… మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. పడిక్కల్ డకౌటవగా…ఆశ్చర్యకరంగా వన్ డౌన్ లో వచ్చిన అశ్విన్ , తర్వాత సంజూ శాంసన్ తక్కువ స్కోరుకే ఔటయ్యారు. అంచనాలు పెట్టుకున్న డస్సెన్, రియాన్ పరాగ్ కూడా నిరాశపరిచాడు. జాస్ బట్లర్ కేవలం 28 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసాడు. మూడో వికెట్ గా బట్లర్ ఔటైన తర్వాత హెట్ మెయిర్ ధాటిగా ఆడేందుకు ప్రయత్నించి 29 పరుగులకు ఔటయ్యాడు. చివర్లో జిమ్మీ నీషమ్ కూడా త్వరగానే ఔటవడంతో రాజస్థాన్ ఓటమి ఖాయమైంది. గుజరాత్ బౌలర్లలో ఫెర్గ్యూసన్ 3 , యశ్ దయాల్ 3 వికెట్లు తీసుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ కు ఇది రెండో ఓటమి. తాజా ఫలితంతో నాలుగో విజయం అందుకున్న గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.
Photo Courtesy; IPL/Twitter
That's that from Match 24.@gujarat_titans win by 37 runs and now sit atop the #TATAIPL Points Table.
Scorecard – https://t.co/yM9yMibDVf #RRvGT #TATAIPL pic.twitter.com/tyce9OyqJa
— IndianPremierLeague (@IPL) April 14, 2022