CPI : చెన్నై సీపీఐ కార్యాలయంపై రాళ్ల దాడి ఘటనలో నలుగురు అరెస్ట్
చెన్నై నగరంలోని టి నగర్ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) కార్యాలయంపై మద్యం సీసాలు, రాళ్ళు విసిరిన
- By Prasad Published Date - 09:18 PM, Sat - 28 October 23

చెన్నై నగరంలోని టి నగర్ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) కార్యాలయంపై మద్యం సీసాలు, రాళ్ళు విసిరిన ఘటనలో నలుగురు వ్యక్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి నలుగురు వ్యక్తులు బిల్డింగ్ కాంపౌండ్ వాల్ దగ్గర మద్యం సేవిస్తున్నారని, మద్యం మత్తులో బిల్డింగ్ వెనుక భాగంలో మద్యం సీసాలు, రాళ్లు విసిరారని అధికారులు తెలిపారు. భవనం ఆవరణలో పార్టీ కార్యకర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న సమయంలో వారిపై రాయి విసిరారని సీపీఐ కార్యకర్త పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. కొద్ది క్షణాల తర్వాత భవనంపై మరో రాయి, మద్యం బాటిల్ విసిరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను కొన్ని గంటల తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, సీపీఐ నేతలు తీవ్రంగా ఖండించారు.