KTR : ఫార్ములా ఈ కేసు.. నేడు ఏసీబీ ఎదుట హాజరుకానున్న కేటీఆర్
KTR : ఫార్ములా ఈరేస్ కేసు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేయగా.. ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏ1గా ఉన్నారు. మరో ఇద్దరు అధికారుల పేర్లు కూడా నమోదు చేశారు.
- Author : Kavya Krishna
Date : 06-01-2025 - 9:13 IST
Published By : Hashtagu Telugu Desk
KTR : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసు కీలకంగా మారింది. ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణల పాలయ్యారు. తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో రూ. 55 కోట్లను విదేశీ సంస్థకు చెల్లించడంలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ కేటీఆర్‌పై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్లు 13(1)(ఏ), 13(2)తో పాటు ఐపీసీ సెక్షన్లు 409, 120(బి) కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి పేర్లను కూడా నిందితులుగా చేర్చారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఏసీబీ కేసు నమోదు చేయగా, ప్రాథమిక వివరాలు సేకరించిన తర్వాత మరింత లోతుగా విచారణ చేపట్టాలని సిద్ధమవుతోంది.
Ayyappa Society : అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆదేశాలు
ఈ నేపథ్యంలోనే.. కేటీఆర్ ఈరోజు ఫార్ములా ఈ కారు రేసు కేసు విచారణలో భాగంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎదుట హాజరవుతున్నారు. ఈ సందర్భంగా, ఆయన ఉదయం 10 గంటలకు ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో కేటీఆర్ గతంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి తనపై నమోదైన కేసు కొట్టివేయాలని కోరారు. కోర్టు తుదివిధి వెల్లడించడాన్ని నిలిపి ఉంచుతూ, అప్పటి వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయరాదని అధికారులను ఆదేశించింది. అయితే, విచారణ కొనసాగించేందుకు అనుమతించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో, ఏసీబీ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల ప్రకారం, జనవరి 6న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని కోరింది. ఇదే కేసులో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేటీఆర్‌ను జనవరి 7న విచారణకు పిలిచింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి , అరవింద్ కుమార్‌ను ఈడీ జనవరి 2, 3 తేదీల్లో విచారణకు పిలిచింది. అయితే, వీరు మరింత సమయం కోరడంతో ఈడీ వారిని విచారణకు మరో వారం గడువు ఇచ్చింది. ఈ కేసు విచారణలో కేటీఆర్ హాజరుతోపాటు ఇతర నిందితుల విచారణ కీలక మలుపు తీసుకునే అవకాశముంది. కోర్టు తుదివిధి కోసం వేచిచూస్తున్నప్పటికీ, ఈ విచారణలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి.
Anantha Sriram : హిందూ ధర్మాన్ని అవమానించే సినిమాలను బహిష్కరించాలి : అనంత శ్రీరామ్