Siraj: రూ. 60తో డొక్కు బైక్ పై ప్రాక్టీస్ కు…
టాలెంట్ ఉంటే లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని కష్టాలు ఎదురయినా తట్టుకుని నిలబడినప్పుడే విజయాన్ని అందుకుంటారు. ఈ విషయాన్ని నిరూపించాడు హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్...
- By Naresh Kumar Published Date - 11:15 AM, Sat - 19 February 22

టాలెంట్ ఉంటే లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని కష్టాలు ఎదురయినా తట్టుకుని నిలబడినప్పుడే విజయాన్ని అందుకుంటారు. ఈ విషయాన్ని నిరూపించాడు హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్…ప్రస్తుతం టీమ్ ఇండియా పేస్ ఎటాక్ లో అద్భుతమైన బౌలర్ గా మారిన సిరాజ్ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. తండ్రి ఆటో డ్రైవర్…తల్లి వేరే వాళ్ళ ఇళ్ళల్లో పని చేసిన పరిస్థితి…దీంతో ఆర్థిక పరంగా తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అయితే ఐపీఎల్ లో ఆడే అవకాశం వచ్చిన తర్వాత ఆ కష్టాలు తీరిపోయాయి. ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కు ఆడుతున్న సిరాజ్ టీమ్ పొడ్ కాస్ట్ లో తన కెరీర్ ముందు ఎదుర్కొన్న కష్టాల గురించి పంచుకున్నాడు.
క్రికెటర్‌గా ఎదిగేందుకు నేను చాలా కష్టపడ్డాననీ, నాన్న ఓ ఆటో డ్రైవర్, అమ్మ ఇళ్లలో పనిచేసేదనీ చెప్పాడు. తన దగ్గర అప్పుడు పాత ప్లాటినా బైక్ ఉండేదనీ, నాన్న రోజు పెట్రోల్ కోసం రూ.60 మాత్రమే ఇచ్చేవాడనీ గుర్తు చేసుకున్నాడు. మా ఇంటి నుంచి చాలా దూరం ఉండే ఉప్పల్ స్టేడియానికి ఆ డబ్బులతోనే బైక్‌పై వెళ్లేవాడిని. బండి ఆగిపోతే ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయని చెప్పాడు. నాన్నను అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక 60 రూపాయలతో మానేజ్ చేసుకునే వాడినని చెప్పుకొచ్చాడు. తన కోసం తల్లిదండ్రుల పడిన కష్టాలు చాలా ఉన్నాయని భావోద్వేగానికి గురయ్యాడు.
అయితే ఐపీఎల్ లో ఆడడం తన జీవితాన్నే మార్చేసిందన్నాడు. నాన్న ఆటో నడపడం, అమ్మ ఇళ్లలో పనిచేయడం మానేసిందనీ , అద్దె ఇంటి నుంచి సొంతింటికి మారిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. సొంత ఇంట్లో తన తల్లిదండ్రులను సంతోషంగా ఉంచాలనుకున్నానీ, అది నెరవేరిందన్నాడు. ఐపీఎల్ తనకు డబ్బుతో పాటు పేరు కూడా ఇచ్చిందన్న సిరాజ్ ఈ రోజు ఇలా ఉన్నాననంటే దానికి కారణం ఐపీఎల్ అంటూ చెప్పుకొచ్చాడు. మొదట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ సిరాజ్ ను రూ. 2.6 కోట్లకు దక్కించుకుంది. అయితే 2018 నుండీ ఈ యువ పేసర్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్నాడు. వేలంలో సిరాజ్ ను బెంగుళూరు 7 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తన కెరీర్ ఎదిగేందుకు ఎంతగానో ప్రోత్సహించాడనీ సిరాజ్ చెప్పాడు. ఐపీఎల్ మ్యాచ్ హైదరాబాద్ లో ఆడేందుకు వచ్చినప్పుడు జట్టు మొత్తాన్నీ తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాననీ , కోహ్లీ రావడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిగా ఉండిపోయిందని సిరాజ్ చెప్పాడు.