Bus Accident’s : సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ ఘటన రిపీట్.. మృత్యు రహదారి నేషనల్ హైవే 44..!
- By Vamsi Chowdary Korata Published Date - 01:32 PM, Fri - 24 October 25
కర్నూలు (Kurnool) శివారు చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు బైకర్ శివశంకర్‌తో సహా 20 మంది మరణించారు. వారి మృతదేహాలను కూడా వెలికితీసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మొత్తం 23 మంది క్షేమంగా బయటపడ్డారు. అయితే, ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పాట్‌కు చేరుకుని డెడ్‌బాడీల వెలికితీతను సమీక్షిస్తున్నారు. ఇప్పటికే చిన్నటేకూరు ప్రమాద స్థలికి ఫోరెస్సిక్ సిబ్బంది చేరుకున్నారు. అక్కడే ఇంక్వెస్ట్ పోస్ట్‌మార్టం పక్రియను చేపట్టనున్నారు. అదేవిధంగా డీఎన్‌ఏ ద్వారా డెడ్‌బాడీలను గుర్తించి మృతుల కుటుంబాలకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
‘పాలెం’ ప్రమాదం రిపీట్..
సరిగ్గా 12 సంవత్సరాల క్రితం.. అక్టోబర్ 30, 2013లో బెంగళూరు నుంచి 51 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బస్సు ఓ కారును ఓవర్‌టేక్ చేస్తుండగా.. అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో డీజిల్ ట్యాంక్ లీక్ అయి పేలుడు సంభవించడంతో ఆ దుర్ఘటనలో మొత్తం 45 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. వారిలో అంతా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే ఉన్నారు. ఈ ప్రమాదంలో కేవలం బస్సు డ్రైవరుతో పాటు క్లీనర్, ఐదుగురు ప్రయాణికులు మాత్రమే మృత్యుంజయులుగా బయటపడ్డారు.
సీఐడీ ఎంక్వైరీ..
మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు దుర్ఘటనపై సీఐడీ పోలీసులు కేంద్రానికి 400 పేజీల నివేదికను సమర్పించారు. బస్సు ప్రమాదానికి గల పలు కారణాలను అందులో పొందుపరిచారు. ఛార్జీషీటులో నాడు ఆర్ అండ్ బీ అధికారులు, జబ్బార్ ట్రావెల్స్, జేసీ ప్రభాకర్‌రెడ్డి సతీమణి పేర్లను కూడా చేర్చారు. వోల్వో బస్సుల తయారీలోనే లోపాలు ఉన్నాయని, ఆ నివేదికలో అధికారులు వెల్లడించారు. నిబంధనలను విరుద్ధంగా బస్సులో సీట్లను మార్చేశారని రిపోర్టులో తెలిపారు. టైర్లకు సమీపంలోనే ఇంధన ట్యాంకులు ఉండటం వల్లే బస్సుకు త్వరగా మంటలు వ్యాపించాయని నిర్ధారించారు. ఆ డీజిల్ ట్యాంక్ కూడా ఘోర ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ లోపం, సీట్లు పెంచడం, బస్సులో ఓవర్ లోడ్ లగేజీ, ప్రమాదకర వస్తువులు ప్రమాదానికి కారణమని సీఐడీ అధికారుల విచారణలో వెల్లడైంది.
కర్నూలు (Kurnool) శివారులోని చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వారి మృతదేహాల వెలికితీత ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మొత్తం 23 మంది ప్రయాణికులు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తెలంగాణ సర్కార్ రూ.5 లక్షలు, అదేవిధంగా క్షతగాత్రులకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించినట్లుగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు