PM Modi Degree: ప్రధాని మోదీ డిగ్రీ వివరాలపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు!
ఆర్‌టీఐ దరఖాస్తు దాఖలు చేసిన తర్వాత 1978లో బీఏ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరి రికార్డులను పరిశీలించడానికి సీఐసీ 2016, డిసెంబర్ 21న అనుమతి ఇచ్చింది. ప్రధాని మోదీ కూడా అదే సంవత్సరంలో ఆ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.
- By Gopichand Published Date - 03:47 PM, Mon - 25 August 25

PM Modi Degree: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన గ్రాడ్యుయేషన్ డిగ్రీ (PM Modi Degree) వివరాలను వెల్లడించాలన్న కేంద్రీయ సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు రద్దు చేసింది. సీఐసీ ఆదేశాలను సవాలు చేస్తూ ఢిల్లీ విశ్వవిద్యాలయం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అనంతరం ఈ తీర్పు ఇచ్చింది.
మోదీ డిగ్రీ వివరాలపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
2016లో దాఖలైన ఒక ఆర్‌టీఐ (సమాచార హక్కు) పిటిషన్ ఆధారంగా ప్రధాని మోదీకి సంబంధించిన గ్రాడ్యుయేషన్ డిగ్రీ వివరాలను బహిర్గతం చేయాలని సీఐసీ.. ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. దీనిపై ఢిల్లీ విశ్వవిద్యాలయం సీఐసీ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సచిన్ దత్తా ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. పౌరుల విద్యా రికార్డులు, డిగ్రీల వివరాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. ప్రధాని మోదీ విద్యా రికార్డుల బహిర్గతంపై గత కొన్ని సంవత్సరాలుగా ఈ న్యాయ పోరాటం కొనసాగుతోంది.
Also Read: Afghanistan: హోం గ్రౌండ్‌ను మార్చుకున్న ఆఫ్ఘనిస్తాన్.. పూర్తి షెడ్యూల్ ఇదే!
సీఐసీ వాదన, విశ్వవిద్యాలయం అభ్యంతరాలు
ఆర్‌టీఐ దరఖాస్తు దాఖలు చేసిన తర్వాత 1978లో బీఏ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరి రికార్డులను పరిశీలించడానికి సీఐసీ 2016, డిసెంబర్ 21న అనుమతి ఇచ్చింది. ప్రధాని మోదీ కూడా అదే సంవత్సరంలో ఆ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అయితే, మూడవ వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టరాదన్న నిబంధనలను ఉటంకిస్తూ విశ్వవిద్యాలయం దీనిని తిరస్కరించింది. ఈ వాదనను సీఐసీ అంగీకరించలేదు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి, ముఖ్యంగా ప్రధానమంత్రి విద్యార్హతలు పారదర్శకంగా ఉండాలని పేర్కొంది. ఈ సమాచారం ఉన్న రిజిస్టర్‌ను ఒక ప్రజా పత్రంగా పరిగణించాలని కూడా సీఐసీ అభిప్రాయపడింది.
ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. యూనివర్సిటీ తరఫున భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఆయన న్యాయ బృందం వాదించారు. డేటాను విడుదల చేస్తే ఒక ప్రమాదకరమైన సంప్రదాయం ఏర్పడుతుందని, ఇది ప్రభుత్వ అధికారుల పనితీరుకు ఆటంకం కలిగించవచ్చని తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. దీంతో ఢిల్లీ హైకోర్టు ఈ అంశంలో విశ్వవిద్యాలయం వాదనతో ఏకీభవించి సీఐసీ ఆదేశాలను రద్దు చేసింది.