CM Revanth Reddy : నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కి శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని ఒక ప్రతిష్ఠాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ పూర్తయిన నియోజకవర్గాల్లో తొలి విడతగా 28 చోట్ల పాఠశాలల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది.
- By Kavya Krishna Published Date - 10:02 AM, Fri - 11 October 24

CM Revanth Reddy : నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి షాద్ నగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటించనున్నారు. జిల్లాలో మూడు చోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ ల శంకుస్థాపన చేయనున్నారు మంత్రులు. బొనకల్ మండలం లక్ష్మి పురంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రఘునాథ పాలెం మండలం జింకల తండాలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని ఒక ప్రతిష్ఠాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ పూర్తయిన నియోజకవర్గాల్లో తొలి విడతగా 28 చోట్ల పాఠశాలల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. పాఠశాల భవనాల నిర్మాణానికి దసరా పండుగకు ముందు భూమి పూజ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంగారెడ్డి జిల్లాలోని కొందుర్గ్ మండలం షాద్‌నగర్ సమీపంలో శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన స్వస్థలమైన మధిర నియోజకవర్గంలో భూమిపూజ చేయనున్నారు. వివిధ మంత్రులు, సలహాదారులు కూడా వేరువేరు నియోజకవర్గాల్లో పాఠశాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.
Lip care: గులాబీ రేకుల వంటి పెదవులు కావాలా..? దీన్ని ప్రయత్నించండి..!
ఈ పాఠశాలల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,000 కోట్ల నిధులు
ఈ పాఠశాలల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,000 కోట్ల నిధులు కేటాయించింది. ప్రతీ పాఠశాల దాదాపు 20-25 ఎకరాల విస్తీర్ణంలో ఉండి, సుమారు రూ. 26 కోట్ల వ్యయంతో నిర్మితమవుతుంది. ఈ కాంప్లెక్స్‌లు అన్ని సౌకర్యాలతో నిండి ఉంటాయి, ఇందులో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్, తరగతి గదులు, హాస్టళ్లు, భోజనశాలలు, లైబ్రరీలు, స్టేడియాలు, ఓపెన్ ఎయిర్ థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ వంటి మౌలిక వసతులు ఉన్నాయి. ఇతర ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడతాయి. పాఠశాలల నిర్మాణ సమయంలో పర్యావరణానికి హానికరంగా ఉండకూడదని, గ్రీన్ బిల్డింగ్స్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కట్టుదిట్టమైన నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న హాస్టళ్లలో తరగతుల నిర్వహణలో, మౌలిక వసతుల్లో తలెత్తిన సమస్యలు దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతి పాఠశాల 12వ తరగతి వరకు విద్యాబోధన అందిస్తుండగా, ఈ పాఠశాలల్లో టీచింగ్ , నాన్-టీచింగ్ సిబ్బందికి రెసిడెన్షియల్ క్వార్టర్స్ కూడా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులు ఒకే చోట చదువుకునే అవకాశముంది. చిన్నతనం నుంచే సామాజిక సమానత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కాంప్లెక్స్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. కుల, మత వివక్షలకు ఈ స్కూళ్ళు పూర్ణవిరామం పెట్టగలవని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి భూసేకరణ పూర్తై, వివిధ విభాగాల నుంచి అవసరమైన అనుమతులు పొందిన 28 నియోజకవర్గాల్లో భూమి పూజలు జరగనున్నాయి. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు తదితరులు తమ తమ నియోజకవర్గాల్లో భూమిపూజ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ పాఠశాలలు విద్యారంగంలో కొత్త దిశా నిర్దేశం చేస్తాయని, ప్రపంచంతో పోటీపడే స్థాయిలో విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తాయని రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
Meesho: ఉద్యోగులకు ‘మీషో’ సూపర్ ఆఫర్.. 9 రోజులు వేతనంతో కూడిన లీవ్స్