KCR: అంతా నార్మల్.. యశోద నుంచి కేసీఆర్ డిశ్చార్జ్..!
- Author : HashtagU Desk
Date : 11-03-2022 - 3:28 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపటి క్రితం యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు ఉదయం కేసీఆర్ స్వల్ప అస్వస్థకు గురవడంతో, ఆయన కుటుంబ సభ్యులు యశోద ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఎడమ చేయి, కాలు కొంత లాగుతుందని కేసీఆర్ చెప్పడంతో, ఆయనకు గుండె సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నాయనే కోణంలో అక్కడి డాక్టర్లు కేసీఆర్‌కు వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించామని చెప్పారు.
ఈ క్రమంలో యశోద ఆసుపత్రి వైద్యులు కేసీఆర్‌కు పలు వైద్య పరీక్షలు చేశారు. యాంజియోగ్రామ్‌తో పాటుగా సిటీ స్కాన్, ఈసీజీ తదితర పరీక్షలను నిర్వహించారు. ఇక పరీక్షల అనంతరం కేసీఆర్‌కు ఎలాంటి గుండె సంబంధిత సమస్యలు లేవని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అలసట వల్ల కొంత ఇబ్బంది ఏర్పడి ఉంటుందని,అన్ని పరీక్షలు నార్మల్ గా ఉన్నాయని యశోద ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. కేసీఆర్‌కు వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని చెప్పిన వైద్యులు ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లారని సమాచారం.