China: భారత జర్నలిస్టును ఆదేశించిన చైనా అధికారులు.. మా దేశం విడిచి వెళ్లిపోండంటూ?
గత కొంతకాలంగా భారతదేశం, చైనాల మధ్య సరిహద్దు విషయంలో వాదోపవాదనాలు, ప్రతి ష్టంభన కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇలా ఉంటే తాజాగా జర్నల
- By Anshu Published Date - 06:16 PM, Mon - 12 June 23

గత కొంతకాలంగా భారతదేశం, చైనాల మధ్య సరిహద్దు విషయంలో వాదోపవాదనాలు, ప్రతి ష్టంభన కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇలా ఉంటే తాజాగా జర్నలిస్టుల విషయంలో కూడా రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడబోతున్నట్టు తెలుస్తోంది. చైనాలో విధులు నిర్వహిస్తోన్న చివరి భారత జర్నలిస్టును తమ దేశం నుంచి వెళ్లిపోవాలంటూ అక్కడి అధికారులు సూచించారు. తమ దేశం విడిచిపోవడానికి జూన్ నెల చివరి వరకు గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో చైనాలో ఇప్పటివరకు ఉన్న ఒకే ఒక్క భారత మీడియా ప్రతినిధి కూడా అక్కడ నుంచి రావాల్సి ఉంటుంది
కాగా చైనాలో ఈ ఏడాది మొదటివరకు పలు భారత మీడియా సంస్థల నుంచి నలుగురు జర్నలిస్టులు విధులు నిర్వహించారు. అయితే, భారత జర్నలిస్టుల వీసా రెన్యూవల్ చేసేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ప్రసార భారతితో పాటు పలు వార్తా పత్రికల ప్రతినిధులు కూడా ఇటీవలే ఇండియాకు వచ్చేశారు. కేవలం పీటీఐ వార్తాసంస్థ ప్రతినిధి మాత్రమే ప్రస్తుతం అక్కడ విధులను నిర్వర్తిస్తున్నారు. అయితే తాజాగా ఆయన్ను కూడా దేశం విడిచి వెళ్లిపోవాలని అందుకోసం ఈనెల చివరి వరకు గడువు ఇచ్చినట్టు అక్కడ అధికారులు తెలిపారు. అయితే దీనిపై ఇరుదేశాల విదేశాంగ శాఖల నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు.
విదేశీ మీడియా ప్రతినిధులకు సంబంధించి చైనా పరిమితి విధిస్తోంది. కానీ, భారత్‌లో పనిచేసే చైనా జర్నలిస్టులకు అటువంటి పరిమితులు ఏమీ లేవు. ఈ క్రమంలో చైనాలో పనిచేస్తున్న భారత జర్నలిస్టులు తమకు సహాయంగా ఉండేందుకు గాను అసిస్టెంట్లు నియమించుకోవాలని ప్రయత్నించారు. కానీ వాటిని తిరస్కరించిన చైనా తమ దేశానికి చెందిన ఇద్దరు మీడియా ప్రతినిధుల వీసాను భారత్ తిరస్కరించిందని ఆరోపించింది. దీంతో ఈ వీసా వివాదం మొదలైంది. అయితే, జర్నలిస్టుల వీసాకు సంబంధించి భారత ప్రభుత్వం గత నెలలో ఒక ప్రకటన కూడా చేసింది. భారత్‌లో పనిచేసే చైనా జర్నలిస్టులకు ఎటువంటి ఆటంకాలు లేనప్పటికీ చైనాలో భారత జర్నలిస్టులకు మాత్రం ఇలాంటి వెసులుబాటు లేదని తెలిపింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత్‌లో పనిచేస్తున్న ఒక చైనా జర్నలిస్టు రెన్యూవల్ మాత్రం పెండింగులో ఉన్నట్లు తెలుస్తోంది..