Chandrababu In ACB Court: ఏసీబీ కోర్టులో మధ్యాహ్నం వరకు విచారణ కొనసాగే ఛాన్స్..?
చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో (Chandrababu In ACB Court) హాజరుపరిచారు.
- Author : Gopichand
Date : 10-09-2023 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
Chandrababu In ACB Court: చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో (Chandrababu In ACB Court) హాజరుపరిచారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును నంద్యాలలో శనివారం తెల్లవారుజామున సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే విజయవాడ ఏసీబీ కోర్టులో స్కిల్ స్కామ్ కేసులో వాడీవేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యేసరికి చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకూ కొనసాగుతాయని అంటున్నారు. కాగా తొలుత 409 సెక్షన్ పై చంద్రబాబు లాయర్ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు స్టేట్మెంట్ ను సైతం రికార్డు చేశారు. ప్రస్తుతం సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో సీఐడీ ఆదివారం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. అయితే కోర్టు వద్దకు అదనపు పోలీసు బలగాలు చేరుకున్నాయి. అంతేకాకుండా చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధిస్తే ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు. కోర్టు పరిసరాల నుంచి మీడియా ప్రతినిధులను దూరంగా పంపించేశారు. దీంతో ఉత్కంఠ నెలకొంది. 2021, డిసెంబర్ 9వ తేదీ కంటే ముందే నేరం జరిగిందని, ఈ కేసులో చంద్రబాబే ముఖ్య కుట్రదారని రిపోర్టులో పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి సీమెన్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ వాటాగా రూ. 371 కోట్లను చెల్లించారని తెలిపారు.
Also Read: ACB Court: బాబు A-1 కాదు.. A-37, స్కామ్ లో చంద్రబాబు పాత్ర కీలకం: సీఐడీ తరుపు న్యాయవాది
టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయవాడ కోర్టులో సీఐడీ రిమాండ్ రిపోర్టు ప్రవేశపెట్టగా అందులో నారా లోకేష్ పేరును సీఐడీ చేర్చింది. చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా నారా లోకేష్‌కు డబ్బులు అందినట్లు సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో నారా లోకేష్ పేరు కూడా చేరడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో చంద్రబాబును ఏ-1గా చేర్చారని తొలుత ప్రచారం జరిగింది. అయితే రిమాండ్ రిపోర్టులో ఏ-1గా గంటా సుబ్బారావు ఉండగా, చంద్రబాబు పేరును ఏ-37గా సీఐడీ అధికారులు చేర్చారు.