Bihar Floods: నీటిలో IAF హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
Bihar Floods: బీహార్ లోని పలు ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా సహాయక సామగ్రిని గాలిలో జారవిడుచుతున్న క్రమంలో హెలికాప్టర్ని నీటితో నిండిన ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
- By Praveen Aluthuru Published Date - 04:07 PM, Wed - 2 October 24

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)కి చెందిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ బుధవారం అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. హెలికాప్టర్‌లో ఇద్దరు పైలట్‌లతో సహా ముగ్గురు సిబ్బంది ఉండగా, వారందరూ సురక్షితంగా ఉన్నారు.
బీహార్(Bihar) లోని పలు ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా సహాయక సామగ్రిని గాలిలో జారవిడుచుతున్న క్రమంలో హెలికాప్టర్ని నీటితో నిండిన ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. హెలికాప్టర్ ఆలా నీటిలో ల్యాండ్ అవ్వడంతో స్థానికులు ఆ ప్రాంతంలో గుమిగూడారు. భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఏదైనా ప్రమాదం జరిగిందా అనుకున్నారు. జిల్లా మేజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ మాట్లాడుతూ హెలికాప్టర్లో ఉన్నవారందరూ క్షేమంగా ఉన్నారనిచెప్పారు . అయితే ముందుజాగ్రత్తగా చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
కోసి వంటి నదుల నీటిమట్టాలు గణనీయంగా పెరగడంతో బీహార్‌లోని పలు జిల్లాలు ప్రస్తుతం తీవ్ర వరదలతో అల్లాడిపోతున్నాయి. వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతోంది. ఉపశమన సామాగ్రి, రెస్క్యూ మరియు ఇళ్ళు కోల్పోయిన బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా నేపాల్‌లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో నీటి ప్రాజెక్టులు పొంగిపొర్లాయి. లక్షలాది క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా రాష్ట్రంలోని 16 జిల్లాల్లో సుమారు 10 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల నుండి ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం నివేదించబడనప్పటికీ, అనేక చోట్ల కట్టలు తెగడం ఆందోళన కలిగిస్తుంది.
Also Read: Pooja Hegde : విజయ్ లాస్ట్ సినిమా ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ.. అధికారికంగా అనౌన్స్..