IPL Fans:ఐపీఎల్ ఫాన్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్
ఐపీఎల్ 15వ సీజన్ ఉత్కంఠ భరితంగా సాగుతూ అభిమానులను అలరిస్తోంది.
- By Naresh Kumar Published Date - 10:05 AM, Sun - 24 April 22

ఐపీఎల్ 15వ సీజన్ ఉత్కంఠ భరితంగా సాగుతూ అభిమానులను అలరిస్తోంది. కరోనా ప్రభావం తగ్గిపోవడంతో స్టేడియంలోకి 40 శాతం ఫాన్స్ ను అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ ఫాన్స్ కు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్లే ఆఫ్ మ్యాచ్ లకు 100 శాతం అభిమానులను అనుమతించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపారు. ప్లే ఆఫ్ మ్యాచ్ ల షెడ్యూల్ ప్రకటించేందుకు సమావేశమయిన అపెక్స్ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోని నాలుగు వేదికలకు మాత్రమే బీసీసీఐ పరిమితం చేసింది. అయితే దేశంలో కొవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లను మరో చోట నిర్వహించేందుకు సిద్ధమయింది. దీనిలో భాగంగా మొదటి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ మైదానంలో జరగనున్నాయి. మే 24 క్వాలిఫయర్, మే 26న ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగనుండగా…మే 27న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. ఇదే వేదికలో మే 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌లకు వందశాతం సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించనున్నారు.
బీసీసీఐ తాజా నిర్ణయంతో ఫాన్స్ సంబరపడుతున్నారు. ముఖ్యంగా ఫైనల్ జరిగే వేదిక అహ్మదాబాద్ స్టేడియం లక్ష కెపాసిటీ కావడంతో ఎక్కువ మంది మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ఇప్పటికే లీగ్ మ్యాచ్ లకు సంబంధించి 40 శాతం టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్ లకు పూర్తి స్టేడియం కెపాసిటీ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టికెట్ల కోసం రచ్చ రచ్చ ఖాయమని చెప్పొచ్చు.