IPL schedule: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసిందోచ్…
క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 26న వాంఖేడే స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్‌కింగ్స్, గత ఏడాది రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
- By Hashtag U Published Date - 10:05 PM, Sun - 6 March 22

క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 26న వాంఖేడే స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్‌కింగ్స్, గత ఏడాది రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. సీజన్ మొత్తంలో 74 మ్యాచ్‌లు జరగనుండగా.. అందులో 12 డబుల్ హెడర్స్ ఉన్నాయి. సీజన్ ఆరంభమైన మరుసటి రోజే డబుల్ హెడర్ మొదలవుతుంది. ఆ రోజు సాయంత్రం మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడనుండగా..
రాత్రి పంజాబ్ కింగ్స్ , బెంగళూరుతో ఆడనుంది. సాయంత్రం మ్యాచ్ 3.30కి ఆరంభం కానుండగా… రాత్రి మ్యాచ్ 7.30కి మొదలవుతుంది. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈ సారి సీజన్ మొత్తాన్నీ మహారాష్ట్రకే పరిమితం చేశారు. ముంబైలోని వాంఖేడే స్టేడియం, డీవై పాటిల్ స్టేడియాల్లో 20 మ్యాచ్‌ల చొప్పున, బ్రబౌర్న్ స్టేడియంలో 15 ,పుణేలోని ఎంసీఎ స్టేడియంలో 15 మ్యాచ్‌ల చొప్పున జరగనున్నాయి. కాగా ఈ సీజన్ నుంచి రెండు కొత్త జట్లు ఎంట్రీ ఇవ్వడంతో లీగ్ గ్రూఫ్ ఫార్మేట్‌లో జరగబోతోంది. మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించగా.. ఒక్క టీమ్ 14 మ్యాచ్‌లను ఆడనుంది. ప్రతీ జట్టూ తన గ్రూప్‌లో ఉన్న ఇతర జట్లతో రెండేసి సార్లు తలపడనుండగా.. అవతలి గ్రూప్‌లోని జట్లతో ఒక్కోసారి ఆడుతుంది. మే 22న హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే పోరుతో లీగ్ దశ ముగియనుండగా..
తర్వాత ప్లే ఆఫ్స్ , ఫైనల్ జరగనున్నాయి.ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ తర్వాత ఖరారు చేయనుంది. మొత్తం 65 రోజుల పాటు క్రికెట్ ఫ్యాన్స్‌ను ఐపీఎల్ అలరించబోతోంది. గ్రూప్ ఎలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ , లక్నో సూపర్‌జెయింట్స్ ఉండగా… గ్రూప్ బీలో చెన్నై సూపర్‌కింగ్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ చోటు దక్కించుకున్నాయి. కోవిడ్ నేపథ్యంలో ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు స్టేడియంలోకి 25 శాతం మందినే అనుమతించనున్నారు. అయితే అప్పటి పరిస్థితిని బట్టి 50 శాతం వరకూ అనుమతించే అవకాశముందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.