TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. బాదుడు షురూ..!
- By HashtagU Desk Published Date - 01:07 PM, Fri - 4 February 22

తెలంగాణ ఆర్టీసీ సంస్థ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి, ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, లభాలబాట పక్కన పెడితే, వచ్చే నష్టాలను మాత్రం పూడ్చ లేకపోతున్నారు. దీంతో సజ్జనార్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం.
గత ఏడాది జనవరిలో ఆర్టీసీ దాదాపు 337 కోట్ల ఆదాయం వచ్చిందని, అయితే ఈ సంవత్సరం మాత్రం, ఆదాయం బాగా తగ్గిందని తెలుస్తోంది. దాదాపు 75 నుండి 100 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని, ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది దసరాకి, ఈ ఏడాది సంక్రాంతికి, ప్రయాణికుల నుండి తెలంగాణ ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేయలేదు. అయితే ఇకముందు మాత్రం ప్రత్యేక బస్సులకు అదనపు చార్జీలు వసూలు చేయాలని తెలంగాణ ఆర్టీసీ సంస్థ నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో ముచ్చింతల్‌లో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం వేడుకలకు హైదరాబాద్ నగరం నుంచి నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయాలని.. గురువారం తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొత్త ధరలు ఈ శుక్రవారం నుండి అమలులోకి రానున్నాయి. ఇక మరోవైపు సమ్మక్క-సారక్క జాతరకు నడిపే బస్సులకు అదనపు చార్జీలు వసూలు పై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆర్టీసీ సంస్థ ఉన్నత అధికారులు చెబుతున్నారు.