Pelli Muhurtham : నవంబర్ 26 నుంచి పెళ్లిళ్లు, శుభకార్యాలకు బ్రేక్! ఇక ఫిబ్రవరి 2026 లోనే పెళ్లి ముహూర్తాలు.
- By Vamsi Chowdary Korata Published Date - 11:56 AM, Mon - 24 November 25
హిందూ క్యాలెండర్ ప్రకారం మూఢమి రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదని, ఒకవేళ మూఢమి సమయంలో శుభకార్యాలు చేస్తే దోషం ఏర్పడుతుందని చెబుతుంటారు. ఇప్పటికే ఈ ఏడాదిలో మార్చి నెలలో మూఢమి ఏర్పడింది. అలాగే.. నవంబర్ నెల 26 నుంచి శుక్ర మౌఢ్యమి లేదా శుక్ర మూఢమి ప్రారంభం కానున్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో అసలు మౌడ్యమి అంటే ఏమిటి? ఈ మౌడ్యమి ఉన్న రోజులు ఏం చేయకూడదు? ఏ కార్యాలు చేయొచ్చు? వంటి విషయాలను తెలుసుకుందాం..
హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని రోజులు శుభకార్యాలు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. మరికొన్ని కొన్ని రోజులు శుభకార్యాలు చేయడానికి అనుకూలంగా ఉండవు. ప్రత్యేకించి మూఢం లేదా మౌఢ్యమి రోజుల్లో శుభకార్యాలు నిర్వహించకూడదని పండితులు చెబుతుంటారు. ఈక్రమంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ ఏడాది నవంబర్ 26వ తేదీ నుంచి శుక్ర మౌడ్యమి గురుడు, శుక్రుడు అస్తంగత్వం ఏర్పడనుంది. ఫిబ్రవరి 17వ తేదీ వరకు ఈ శుక్ర మౌఢ్యమి కొనసాగుతుంది. అంటే సుమారు 83 రోజుల పాటు అంటే.. శ్రీవిశ్వావసు నామ సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మాఘమాసం బహుళ అమావాస్య వరకు ఈ శుక్ర మౌడ్యమి ఉండనుంది. ఈ సమయంలో శుభకార్యాల్ని చేయకపోవడం అనేది పూర్వం నుంచి వస్తోన్న సంప్రదాయం. కాబట్టి మాఘ మాసం వచ్చే వరకు వివాహాది కార్యక్రమాలకు శుభ ముహుర్తాలు లేనట్లే.
మూఢమి అంటే శూన్యం లేదా చీకటి అని అర్థం. గురుడు లేదా శుక్రడు సూర్యుడితో కలిసి ఉండే కాలాన్ని మౌఢ్యమి అంటారు. దీనినే వాడుక భాషలో ఆయా ప్రాంతాలను బట్టి మూఢమి లేదా మూఢం అని అంటారు. నవగ్రహాల్లోని గురుడు, శుక్రుడు గమనం చేస్తున్న క్రమంలో సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు అవి తమ కాంతిని కోల్పోవడం ద్వారా చీకటి లేదా మూఢమి సంభవిస్తుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే సౌర కుటుంబానికి సూర్యుడు పెద్దగా చెబుతారు. సూర్యుడి శక్తి, కాంతి అనంతం. అలాగే గురుడు, శుక్రుడు ఇవి రెండూ శుభ గ్రహాలు. ఈ శుభ గ్రహాలు మూఢమి సమయంలో తమ తేజస్సును కోల్పోవడం వల్ల.. చీకటి రోజులుగా భావించి శుభకార్యాలను వాయిదా వేస్తుంటారు. సాధారణంగా శుభకార్యాలు నిర్వహించాలంటే గురు బలం బాగా ఉండాలి. అలాగే సిరిసంపదలు, సంతోషాలకు శుక్ర బలం ఎక్కువగా ఉండాలి. అయితే మూఢమి సమయంలో ఈ రెండు గ్రహాలు బలహీనంగా తేజస్సు కోల్పోయి ఉంటాయి.. కాబట్టి ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు అని పండితులు చెబుతుంటారు. అందుకే ఈ మూఢమి ఉన్నన్ని రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు.
ఈ మూఢమి సమయంలో పెళ్లిచూపులు, నిశ్చితార్థం, వివాహం, ఉపనయనం, నూతన గృహప్రవేశం, ఇంటికి లగ్నం, యజ్ఞాలు, దేవతా విగ్రహ ప్రతిష్ఠలు, వాహనం, ఇల్లు వంటివి కొనడం, బోర్లు వేయించడం, పుట్టువెంట్రుకలు తీయించడం, చెవులు కుట్టించడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, తీర్థయాత్రలకు వెళ్లడం, కొత్త ప్రయాణాలు ప్రారంభించడం, పదవీ ప్రమాణ స్వీకారం వంటివి చేయకూడదని పండితులు చెబుతున్నారు.
అయితే యథాతథంగా జరుపుకునే వాటిలో సీమంతం, నూతన వస్త్రాలంకరణ వంటి వాటికి ఈ మూఢమి వర్తించదు అని చెబుతున్నారు. ఈ కార్యక్రమాలకు నమ్మకమైన పండితులను సంప్రదించి నిర్వహించుకోవచ్చు అని చెబుతున్నారు. అలాగే కొన్ని అనివార్యమైన, నిత్య కర్మలకు ఈ మూఢమి దోషం వర్తించదని కూడా చెబుతున్నారు. వాటిలో ప్రధానంగా రోజువారీ ప్రయాణాలు, నిత్యపూజ, అభిషేకం, నవగ్రహ శాంతి, సీమంతం, నామకరణం, అన్నప్రాశన వంటి కార్యక్రమాలు, చాతుర్మాస్య వ్రతాలు వంటివి ఈ శుక్ర మౌఢ్యమి రోజుల్లో వచ్చినా కూడా నిరభ్యంతరంగా చేయవచ్చని చెబుతున్నారు. ఇక ఈ ఏడాది మార్చిలో కూడా మూఢం రోజులు (మార్చి 13 నుంచి 25 వరకు) వచ్చిన విషయం తెలిసిందే.