Gurukul: గురుకుల్లో టీజీటీ పోస్టులు 75 శాతం మహిళలకే!
- Author : Balu J
Date : 28-04-2023 - 11:06 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల్లో 75 శాతం మహిళలకే కేటాయించారు. గురుకులాల్లో ఉన్న 4,006 పోస్టులకు గాను 3,012 (అంటే 75 శాతం) పోస్టులు మహిళలకే కేటాయిస్తూ గురువారం సమగ్ర ఉద్యోగ ప్రకటన జారీ చేశారు. మిగిలిన 994 పోస్టులు జనరల్ అభ్యర్థుల కోటాకు కేటాయించారు. అయితే, వీటిలో కూడా మహిళలకు పోస్టులు దక్కే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు.
బాలికలు, మహిళా గురుకులాల్లో ఉండే పోస్టులన్నీ మహిళలతోనే భర్తీ చేయాలని గతంలోనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వం కూడా ఇందుకు అనుగుణంగా నిబంధనలు రూపొందించింది. అందువల్లే 75 శాతం పోస్టులు వారికే దక్కేలా ప్రకటన జారీ చేశారు. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,231 పోస్టులకు గాను ఈ నెల 5న ఒకే సారి 9 ఉద్యోగ ప్రకటనలను గురుకుల నియామక బోర్డు జారీ చేసింది. ఇప్పటికే 8 ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి సమగ్ర ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. వీటికి సంబంధించి నేటి నుంచి మే 27 సాయంత్రం వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకుంటారు.