4 killed : బెంగుళూరులో విషాదం..గోడకూలి నలుగురు వలస కూలీలు మృతి
బెంగళూరు శివార్లలో విషాదం నెలకొంది. గురువారం ఉదయం నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ గోడ కూలి ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురు వలస కూలీలు మరణించారు.
- By Prasad Published Date - 04:13 PM, Thu - 21 July 22

బెంగళూరు శివార్లలో విషాదం నెలకొంది. గురువారం ఉదయం నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ గోడ కూలి ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురు వలస కూలీలు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోస్కోటే పట్టణ సమీపంలోని తిరుమలశెట్టిహళ్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగినప్పుడు మృతులు షెడ్‌లో ఉండి నిద్రిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో నలుగురు కూలీలను పోలీసులు, స్థానికులు రక్షించారు. మృతులంతా ఉత్తరప్రదేశ్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో పనిచేసి, అపార్ట్‌మెంట్ కాంపౌండ్ వాల్‌కు సమీపంలోని షెడ్‌ల వద్ద బస చేశారు. ఎనిమిది మంది కూలీలు బుధవారం సాయంత్రం పని ముగించుకుని షెడ్డులో నిద్రించారు. తెల్లవారుజామున షెడ్డుపై కాంపౌండ్ వాల్ కూలింది. మృతులను మనోజ్ కుమార్ సదయ్, రామ్ కుమార్ సదయ్, నితీష్ కుమార్ సదయ్ గా గుర్తించారు. మరో వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. గాయపడిన కూలీలు సునీల్ మండల్, శంభు మండల్, దిలీప్, దుర్గేష్‌లను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తిరుమలశెట్టిహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.