82 Lakh Crores : రూ.82 లక్షల కోట్లు.. ఇండియా స్పేస్ సెక్టార్ వ్యాల్యూకు రాకెట్ స్పీడ్ !
82 Lakh Crores : ప్రతిదానికీ ఒక లెక్క ఉంటుంది. అలాగే మన చంద్రయాన్-3 విజయానికీ ఒక లెక్క ఉంది. ఈ విజయంతో మనదేశ అంతరిక్ష రంగానికి కూడా లింకు ఉంది.
- By Pasha Published Date - 08:44 AM, Mon - 28 August 23

82 Lakh Crores : ప్రతిదానికీ ఒక లెక్క ఉంటుంది. అలాగే మన చంద్రయాన్-3 విజయానికీ ఒక లెక్క ఉంది. ఈ విజయంతో మనదేశ అంతరిక్ష రంగానికి కూడా లింకు ఉంది. ఈ సక్సెస్ భారత స్పేస్ సెక్టార్ కు రెక్కలు తొడిగిందని చెప్పొచ్చు. ప్రపంచ మార్కెట్ లోని మన దేశ స్పేస్ సెక్టార్ సేవలకు డిమాండ్ ను మరింత పెరిగింది. ఈ పరిణామంతో రానున్న రోజుల్లో కాసుల వర్షం కురవనుంది. ఇస్రోతో పాటు స్పేస్ సెక్టార్ అనుబంధ సేవలు అందిస్తున్న భారత సంస్థలకు ఇది గోల్డెన్ ఛాన్స్ లాంటిది. దీంతో మన దేశ అంతరిక్ష రంగం విలువ వచ్చే కొన్నేళ్లలో 82 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని సాక్షాత్తూ భారత శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (సైన్స్ అండ్ టెక్నాలజీ) జితేంద్ర సింగ్ అంచనా వేశారు. చంద్రుడి ఉపరితలంపై ఉన్న ఖనిజాలు, హీలియం వంటి ఇంధన వనరుల కోసం జరుగుతున్న అన్వేషణ రేసులో భారత్ ప్రస్తుతానికి ముందంజలోనే ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈక్రమంలో స్పేస్ రీసెర్చ్ టెక్నాలజీ కోసం చాలా దేశాలు భారత్ తో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ డీల్స్ వల్ల మనదేశ స్పేస్ సెక్టార్ ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోనుంది. ఇప్పటికే ఈవిభాగంలో భారీగా ఆదాయం గడిస్తున్న రష్యా, చైనా, అమెరికాల సరసన భారత్ కూడా చేరిపోవడం పెద్ద ప్లస్ పాయింట్. ఫలితంగా అంతర్జాతీయ సమాజంలో ఇండియా విలువ మరింతగా ఇనుమడిస్తుంది.
Also read : Bandhavgarh Tiger Reserve: బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లో పులి అనుమానాస్పద మృతి
జాబిల్లిపై నీరు, హీలియం నిల్వలు..
చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ల్యాండర్ ను తొలిసారిగా దింపిన దేశం భారత్ మాత్రమే. జాబిల్లిపై రాకెట్ల ఇంధనం తయారీకి వినియోగించే సమ్మేళనాలు లభిస్తాయని, అక్కడ హీలియం నిల్వలు ఉన్నాయని ఇస్రో భావిస్తోంది. అదే నిజమైతే వాటిని భూమికి తీసుకొచ్చే వరకు.. రానున్న కాలంలో మరిన్ని ప్రయోగాలను ఇస్రో నిర్వహిస్తుంది. ఇదంతా జరగడానికి ఇంకొన్ని దశాబ్దాల టైం.. వేల కోట్ల బడ్జెట్ అవసరమవుతుంది. ఇదంతా చేస్తూనే.. స్పేస్ రీసెర్చ్ లో తమకున్న నాలెడ్జ్, క్రెడిబులిటీతో వ్యాపార కార్యకలాపాలను ఇస్రో వేగిరం చేసుకుంటుంది. ఇది దేశానికి కూడా లాభదాయకంగా పరిణమిస్తుంది. ఇప్పటికే శాటిలైట్ కమ్యూనికేషన్ అభివృద్ధి, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీలో ఎన్నో డెవలపింగ్ దేశాలకు ఇస్రో వాణిజ్యపరమైన సహాయ సహకారాలను అందిస్తోంది.
వేగం పెంచిన చైనా, అమెరికా..
సూర్యుడిపై రీసెర్చ్ కోసం త్వరలోనే ఇస్రో ఆదిత్య ఎల్-1 శాటిలైట్ ను ఇండియా ప్రయోగించనుంది. ఆ తర్వాత గగన్ యాన్ మిషన్ పై ఫోకస్ పెట్టనుంది. దాని ద్వారా మనుషులను అంతరిక్షంలోకి పంపనుంది. ఆ తర్వాత చంద్రుడిపైకి మనుషులను పంపే దిశగా భారత్ ప్రయోగాలను వేగవంతం చేస్తుంది. 2025 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి వ్యోమగాములను పంపాలని అమెరికా ప్రయత్నిస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే మొదలుపెట్టింది. 2030 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి వ్యోమగాములతో ఒక అంతరిక్ష నౌక, వ్యోమగాములు లేకుండా మరో నౌకను పంపించాలని చైనా స్కెచ్ గీస్తోంది. ఇజ్రాయెల్, జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి అనేక దేశాలు కూడా చంద్రుడిపై ప్రయోగాలకు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే వాటి ప్రయత్నాలన్నీ ఇంకా మొదటి దశలోనే విఫలమయ్యాయి.
Also read : Today Horoscope : ఆగస్టు 28 సోమవారం రాశి ఫలాలు.. వారికి శ్రమ పెరుగుతుంది
ఆ ఒప్పందంపై చైనా, రష్యా సంతకం చేయలేదు
చంద్రుడిపై నీటి జాడ ఉందనే ఆశాభావంతో ఇస్రో ఉంది. నీళ్లు లభిస్తే అక్కడే ఒక శాశ్వత స్పేస్ రీసెర్చ్ స్టేషన్ (పర్మినెంట్ బేస్)ను నిర్మించాలని ఇస్రో, జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ (జాక్సా), నాసాలు సంయుక్తంగా ప్లాన్ చేస్తున్నాయి. 2025కల్లా ఆ దిశగా పురోగతి సాధించాలని అవి భావిస్తున్నాయి. చంద్రుడిపై నుంచే అంగారకుడు (మార్స్), ఇతర గ్రహాలపైకి స్పేస్ క్రాఫ్ట్ లను పంపే ఏర్పాట్లను చేసుకుంటే మరీ మంచిదని ఈ దేశాలు అనుకుంటున్నాయి. అంతరిక్ష పరిశోధనల్లో లభ్యమయ్యే వనరులను అన్ని దేశాలు సమానంగా వినియోగించుకోవడానికి అంగీకరిస్తూ అర్టెమిస్ అగ్రిమెంట్ జరిగింది. 2020లో ఈ ఒప్పందంలో అమెరికా, భారత్ కూడా భాగస్వాములుగా చేరాయి.. కానీ, అంతరిక్ష పరిశోధనల్లో పెద్ద శక్తులుగా ఉన్న చైనా, రష్యా మాత్రం ఇప్పటికీ ఆ ఒప్పందంపై సంతకాలు చేయలేదు.