Israel Gaza war: వరుస యుద్ధాలతో కుదేలైన గాజా దుఃఖ చరిత్ర
గాజా-2014, అనే డాక్యుమెంటరీ నెట్ లో అందుబాటులో ఉంది. ఇది 2014 యుద్ధంలో అతలాకుతలమైన గాజా దుస్థితికి దృశ్యరూపం. ఈ డాక్యుమెంటరీలో కొందరు పిల్లల ఇంటర్వ్యూలు ఉంటాయి.
- By Praveen Aluthuru Published Date - 12:01 PM, Mon - 23 October 23

డా. ప్రసాదమూర్తి
Israel Gaza war: గాజా-2014, అనే డాక్యుమెంటరీ నెట్ లో అందుబాటులో ఉంది. ఇది 2014 యుద్ధంలో అతలాకుతలమైన గాజా దుస్థితికి దృశ్యరూపం. ఈ డాక్యుమెంటరీలో కొందరు పిల్లల ఇంటర్వ్యూలు ఉంటాయి. యుద్ధంలో తాము ఎలాంటి అనుభవాలు పొందారో, తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఎందరు మృత్యువాత పడ్డారో, ఎలా గాయపడ్డారో, ఆసుపత్రుల స్థితిగతులు ఏంటో, తమ కుటుంబాలకు ఆధారమైన వ్యవసాయ, వ్యాపారాలు ఎలా ధ్వంసమైపోయాయో.. అన్నీ ఆ పిల్లల నోటితో వింటాం. డాక్యుమెంటరీ కడదాకా చూసిన తర్వాత హృదయం ద్రవించిపోతుంది. అది సినిమా కాదు వాస్తవం.
భూగోళంలో ఎవరు ఎక్కడున్నా మనలాగే వాళ్లూ మనుషులే. వాళ్లకీ కుటుంబాలు, పిల్లలు పెద్దవాళ్లు, మానవ సంబంధాలు, మనుగడ కోసం నిరంతర సంఘర్షణలు చిన్నచిన్న ఆనందాలు అన్నీ ఉంటాయి. చిన్నపిల్లల నోటి నుంచి ఆ యుద్ధ వాతావరణ బీభత్స కథనాలు వింటే బండరాళ్లు కూడా కరిగిపోవాల్సిందే. ఒకటి కాదు రెండు కాదు గడిచిన 15 సంవత్సరాలలో గాజా 5 భయంకర యుద్ధాలను చవిచూసింది. 2014 నాటి యుద్ధానంతర స్థితి కంటే ప్రస్తుతం ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధ బీభత్సం ఎన్నో రెట్లు ఎక్కువ అని ప్రపంచ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇప్పుడు తాజాగా జరుగుతున్న ఇజ్రాయిల్ దాడిలో ఇప్పటికే గాజాలో 4,700 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడ నుంచి వస్తున్న కొన్ని నివేదికలు ద్వారా తెలుస్తోంది. చనిపోయిన వారిలో 1800 మంది పిల్లలు ఉన్నారన్న విషయం మరింత కలచి వేస్తుంది. ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న ప్రస్తుత దాడిలో 16 వేల మంది పైగా క్షతగాత్రులయ్యారు. ఇది ఇప్పటి గాజా పరిస్థితి.
2007 నుంచి గాజా ప్రాంతాన్ని ఇజ్రాయిల్ దిగ్బంధనం చేసిన తర్వాత గాజాలో అన్ని రంగాలలోనూ అభివృద్ధి పడిపోయింది. గాజాలో హమాస్ మిలిటెంట్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత, గత 15 ఏళ్ళలో దాదాపు 5 యుద్ధాలను గాజా ప్రజలు ఎదుర్కొన్నారు. గాజాను 1967 యుద్ధం తర్వాత ఇజ్రాయిల్ పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. అయితే 2005లో తిరిగి పాలస్తీనియులకు గాజాని ఇజ్రాయిల్ అప్పగించింది. దాని తర్వాత రెండు మూడేళ్లకే గాజా ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మొదలైంది. గాజాకు తూర్పున, ఉత్తరాన ఇజ్రాయిల్ ఉంది. దక్షిణాన ఈజిప్ట్ ఉంది. పశ్చిమాన మధ్యధరా సముద్రం ఉంది. అందుకే గాజా ప్రజలు గాలి స్వేచ్ఛగా పీల్చుతున్నా, ఎటు వెళ్లడానికీ వీలులేని నిర్బంధ జీవితాన్ని అనుభవిస్తుంటారు. కనుకనే గాజాను ఒక బహిరంగ జైలుగా అందరూ చెప్తారు. 2007లో ఇజ్రాయిల్ గాజా పై జలవాయు భూమార్గాల దిగ్బంధనాన్ని విధించింది. కేవలం ఈజిప్టు వైపు తప్ప మరో దిక్కు గాజా ప్రజలకు లేకుండా పూర్తిగా దిక్కులేని వారయ్యారు. ఇలా ఇజ్రాయిల్ గాజా ప్రాంతాన్ని అప్పగించినట్టే అప్పగించి మరోవైపు అన్ని రకాల దిగ్బంధనాలూ కొనసాగించడం వల్ల గాజా, ఇజ్రాయిల్ మధ్య పలు దఫాలు యుద్ధం జరిగింది. ఫలితంగా యుద్ధానంతరం అనేక నష్టాలతో గాజా మొత్తం ఒక క్షతగాత్ర దేహంగా మారిపోయింది.
గడచిన 15 ఏళ్లలో ఇజ్రాయిల్ తో గాజా ఐదు యుద్ధాలు చేసింది. 2008, 2012, 2014, 2021- ఈ నాలుగు యుద్ధాలు కాక ప్రస్తుతం జరుగుతున్నది ఐదో యుద్ధం. యుద్ధం జరిగిన ప్రతిసారి గాజా లో అధిక శాతం భవనాలు నేలమట్టమైపోయాయి. అమాయక సాధారణ పౌరులు ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అన్నిటికీ మించి వరుస యుద్ధాల ఫలితంగా దుర్భర దారిద్ర్యాన్ని గాజా ప్రజలు చవిచూడాల్సి వస్తుంది. సగటు ఆదాయం నిరంతరం పడిపోతూ వస్తోంది. ప్రపంచ దేశాల జిడిపితో పోల్చుకుంటే గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రజల వ్యక్తిగత జిడిపి చాలా కింద ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఇప్పటికే గతంలో ఎన్నడూ లేనంత ప్రాణ నష్టాన్ని తెచ్చిపెట్టింది. 2014లో ఏడు వారాలపాటు జరిగిన యుద్ధంలో 2,250 మంది పాలస్తీనీయులు చనిపోయారు. ప్రస్తుత యుద్ధంలో ఇప్పటికే సంఖ్య 4,700 దాటింది. ఇక యుద్ధం ముగిసేనాటికి ఏ రూపంలో ఎంత నష్టం జరుగుతుందో అంచనా వేయలేం.
యుద్ధం వల్ల కేవలం మనుషుల మరణాలు మాత్రమే నష్టం కాదు. మనుషులు జీవితమంతా కష్టపడి నిర్మించుకున్న ఇళ్లు శిథిలాలు శిథిలాలుగా ధ్వంసమైపోతాయి. వారు ఆరుగాలం కష్టపడి పండించుకునే పంటలు నాశనమైపోతాయి. వ్యాపారాలు కుప్పకూలిపోతాయి. ఉద్యోగాలు కనుమరుగైపోతాయి. ఈ కారణాలతో మరింత నిరుద్యోగం, మరింత దారిద్య్రం, మరిన్ని అష్ట కష్టాలు గాజా ప్రజలు అనుభవించాల్సి ఉంటుంది. యుద్ధం జరుగుతూ ఉంటుంది. మనుషులు చనిపోతూ ఉంటారు. అన్ని రంగాల్లో నష్టం వాటిల్లుతూ ఉంటుంది. మరోపక్క ఏవో సహాయ సామగ్రి, మందులు, ఆహారాలు బట్టలు, అందుతూ ఉంటాయి. ఒక దేశం ఇలా యుద్ధాలు కారణంగా అనాథలా మారిపోయి, ప్రపంచ దేశాలు పంపించే సహాయం మీద బతకంతా ఆధారపడవలసి రావడం అంతకుమించిన శాపం మరొకటి ఉండదు. ఎప్పుడు ఈ యుద్ధం అంతమవుతుందో, ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య ఎప్పుడు శాంతి నెలకొంటుందో, అన్ని దేశాల్లో ప్రజలులాగే పాలస్తీనా ప్రజలు కూడా శాంతితో జీవితాన్ని ఎప్పుడు సాగిస్తారో.. అంతా అయోమయం. ఇప్పటికైనా ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకొని, యుద్ధాన్ని అంతమొందించి, గజగజ వణుకుతున్న గాజాను పునర్నిర్మించి ఆదేశానికి ప్రాణం పోస్తుందని ఆశిద్దాం. గాజాను పాలిస్తున్న మిలిటెంట్లు కూడా టెర్రరిజం తమ సమస్యకు పరిష్కారం కాదని గుర్తించాలి. ద్వైపాక్షిక చర్చలతో శాంతియుత వాతావరణంతో ఎవరి దేశాల వారు పరిపాలించుకుంటే మంచిది.
Also Read: Rashmika Mandanna : ఇంతకీ రష్మిక ఎవరి గర్ల్ ఫ్రెండ్..?