Waqf Amendment Bill: వక్ఫ్ బిల్లు వలన ముస్లిం మహిళలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?
చివరగా వక్ఫ్ నిర్వహణలో డిజిటలైజేషన్ ప్రవేశపెట్టడం ద్వారా అవినీతి, దుర్వినియోగాన్ని నిరోధిస్తుంది. డిజిటల్ రికార్డులు పారదర్శకతను పెంచుతాయి.
- By Gopichand Published Date - 06:45 AM, Fri - 4 April 25

Waqf Amendment Bill: వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025 (Waqf Amendment Bill) భారతదేశంలోని ముస్లిం మహిళలకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ప్రవేశపెట్టబడిన ఒక ముఖ్యమైన చట్టం. ఈ బిల్లు లింగ న్యాయం, ఆర్థిక సాధికారత, సామాజిక స్థిరత్వాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తుంది. ఈ బిల్లు ద్వారా మహిళలకు వారసత్వ హక్కులు, ఆర్థిక సహాయం, నిర్ణయాత్మక ప్రక్రియలలో పాల్గొనే అవకాశం.. విద్యా, నైపుణ్యాభివృద్ధి సౌలభ్యాలు అందుబాటులోకి వస్తాయి.
మొదటిగా ఈ బిల్లు కుటుంబ వక్ఫ్ (వక్ఫ్-అలాల్-అవులాద్) కింద మహిళల వారసత్వ హక్కులను రక్షిస్తుంది. ఆస్తిని వక్ఫ్‌కు అంకితం చేసే ముందు మహిళా వారసులకు వారి న్యాయమైన వాటా లభిస్తుందని నిర్ధారిస్తుంది. సెక్షన్ 3A(2) ప్రకారం.. వారసత్వ చట్టాల ఉల్లంఘన వల్ల మహిళలు ఆస్తిలో తమ హక్కును కోల్పోకుండా చూస్తుంది. ఇది గతంలో మహిళలు తరచూ ఎదుర్కొన్న అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం. ఈ నిబంధన మహిళలకు ఆర్థిక భద్రతను అందిస్తుంది.
రెండవది.. వక్ఫ్-ఉల్-ఔలాద్ పరిధిని వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు, అనాథలకు విస్తరించడం జరిగింది. సెక్షన్ 3(R)(iv) ప్రకారం వక్ఫ్ ఆదాయాన్ని ఈ దుర్బల వర్గాల సంక్షేమం కోసం ఉపయోగించవచ్చు. ఇది ఆర్థిక సహాయం అవసరమైన మహిళలకు స్థిరత్వాన్ని అందిస్తుంది. ఇస్లామిక్ సంక్షేమ సూత్రాలకు అనుగుణంగా, ఈ చర్య లింగ సమానత్వాన్ని బలోపేతం చేస్తుంది.
Also Read: BRS IT Cell: హెచ్‌సీయూ వ్యవహారం.. బీఆర్ఎస్ ఐటీ సెల్‌పై కేసు
మూడవది.. వక్ఫ్ బోర్డులలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది. సెక్షన్ 9, సెక్షన్ 14 ప్రకారం సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ఇద్దరు ముస్లిం మహిళలను సభ్యులుగా చేర్చడం జరుగుతుంది. దీని వల్ల వక్ఫ్ వనరుల పంపిణీ, నిర్వహణలో మహిళలకు నిర్ణయాత్మక అధికారం లభిస్తుంది. ఇది వారి సాధికారతకు ఒక ముఖ్యమైన అడుగు.
అదనంగా ఈ బిల్లు మహిళలకు విద్యా స్కాలర్‌షిప్‌లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, సూక్ష్మ ఆర్థిక సహాయం, వారసత్వ వివాదాలు లేదా గృహ హింస కేసులలో న్యాయ సహాయం అందిస్తుంది. ఈ సౌలభ్యాలు మహిళల్లో ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రోత్సహిస్తాయి. వృత్తి శిక్షణా కేంద్రాలు, స్వయం సహాయక బృందాల (SHGs) ఏర్పాటు ద్వారా మహిళలు ఆరోగ్య సంరక్షణ, వ్యవస్థాపకత, ఫ్యాషన్ డిజైన్ వంటి రంగాలలో నైపుణ్యాలు పొందవచ్చు. ఇది వారి ఉపాధి, స్వావలంబనను పెంచుతుంది.
చివరగా వక్ఫ్ నిర్వహణలో డిజిటలైజేషన్ ప్రవేశపెట్టడం ద్వారా అవినీతి, దుర్వినియోగాన్ని నిరోధిస్తుంది. డిజిటల్ రికార్డులు పారదర్శకతను పెంచుతాయి. దీని వల్ల నిధులు సరైన లబ్ధిదారులకు చేరుతాయి. ఇది మహిళలకు కేటాయించిన వనరులు సమర్థవంతంగా వినియోగించబడతాయని హామీ ఇస్తుంది. మొత్తంగా వక్ఫ్ (సవరణ) బిల్లు ముస్లిం మహిళలకు వారసత్వ హక్కులు, ఆర్థిక స్థిరత్వం, పాలనలో ప్రాతినిధ్యం, విద్యా, ఆర్థిక అవకాశాలను అందిస్తూ వారి జీవన పరిస్థితులను మెరుగుపరుస్తుంది. ఈ సంస్కరణలు దీర్ఘకాలిక లింగ సమానత్వానికి బాట వేస్తాయి.