Ageing in India: వృద్ధ భారతమా నీకు వందనం!
ఏ ఇంట్లో పెద్దవాళ్లు ఆరోగ్యంతో ఉంటారో ఆ ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నట్టు లెక్క. అసలైన సిరిసంపదలు సుఖ సంతోషాలే. కేవలం ఇల్లే కాదు, దేశానికి కూడా ఇదే ప్రమాణం వర్తిస్తుంది. దేశంలో వృద్ధుల సంఖ్య ఎంత పెరిగితే ఆ దేశం అంత ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క.
- By Praveen Aluthuru Published Date - 07:03 PM, Sun - 22 October 23

డా.ప్రసాదమూర్తి
Ageing in India::ఏ ఇంట్లో పెద్దవాళ్లు ఆరోగ్యంతో ఉంటారో ఆ ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నట్టు లెక్క. అసలైన సిరిసంపదలు సుఖ సంతోషాలే. కేవలం ఇల్లే కాదు, దేశానికి కూడా ఇదే ప్రమాణం వర్తిస్తుంది. దేశంలో వృద్ధుల సంఖ్య ఎంత పెరిగితే ఆ దేశం అంత ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఈమధ్య ‘బ్లూ జోన్స్’ అనే ఒక డాక్యుమెంటరీ చూశాను. అది ప్రపంచంలో ఎక్కడెక్కడ అధిక సంఖ్యలో వృద్ధులు ఆరోగ్యంగా ఉన్నారో చూపించిన డాక్యుమెంటరీ. కొన్నిచోట్ల శతాధిక వయసున్న వృద్ధులు, చాలా చోట్ల ఎనభై,తొంభై ఏళ్ళు పైబడిన వృద్ధులు. అందరిలో ఒకటే సామీప్యం.. అదే ఆరోగ్యం. ఇందులో నేను గమనించింది వృద్ధులు సంఖ్య అధికంగా ఉండడం కాదు వృద్ధులు ఆరోగ్యంగా ఉండడం. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన దేశంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య 2050 నాటికి రెట్టింపు అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెలువరించిన ఒక నివేదిక ద్వారా తెలిసింది. 2022 తో పోల్చుకుంటే మన దేశంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు 2050 సంవత్సరానికి వచ్చేసరికి రెట్టింపు అవుతారని ఈ నివేదిక చెబుతోంది. 2000 సంవత్సరంలో మనదేశంలో సాధారణ ఆయుఃప్రమాణం 62. 1 సంవత్సరాలుగా ఉంటే, అది 2019 నాటికి 70.8 సంవత్సరాలకు చేరుకుంది. అంటే 70 ఏళ్ళు పైబడిన వారి సంఖ్య 2050 నాటికి రెట్టింపు అవుతుంది. ఇది ముమ్మాటికీ శుభవార్తే. కానీ వృద్ధులు ఎంత ఆరోగ్యంగా ఎంత ఆనందంగా ఉన్నారు అనేదే ముఖ్యం. వారి వయసు కాదు, వారి సంతోషంతో ఒక దేశపు సంతోషం ముడిపడి ఉంటుంది అన్న విషయాన్ని మనం గమనించాలి.
దేశంలోని వృద్ధులలో 80 శాతం గ్రామీణ ప్రాంతంలో ఉంటారు. అందులో సగ భాగం మహిళలు. ఈ లెక్క బాగానే ఉంది కానీ మనం బాధపడాల్సిన ఒక లెక్క ఇందులో ఉంది. అది ఏమిటంటే వీరిలో 30 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. అదే మనం ఆందోళన చెందాల్సిన విషయం. పెరుగుతున్న వృద్ధుల సంఖ్య కు తగినట్టు మనదేశంలో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉందా లేదా అనేది ఈ ఆందోళనకు కారణం. ఇంట్లో పెద్దలు ఉంటే చేతిలో దీపం ఉన్నట్టే లెక్క. కానీ ఆ దీపం మసకబారకుండా నిరంతరం వెలుగులు పంచేలా దానికి అవసరమైన చమురు ఉందా లేదా అని పరిశీలించుకోవలసిన బాధ్యత మనకు ఉంటుంది.
ప్రపంచమంతా మృత్యు చీకట్లు అలముకున్న కరోనా కరాళ కాలం మనకు గుర్తే ఉంది. ఏదైనా ఆపద వచ్చినప్పుడే దాన్ని ఎదుర్కోవడానికి మనం ఎంత సన్నద్ధంగా ఉన్నామో అర్థమవుతుంది. వొట్టి మాటలు కట్టి పెట్టోయ్.. గట్టిమేల్ తలపెట్టవోయ్ అని మన మహాకవి గురజాడ చెప్పింది అదే. మన వారు నిరంతరం మాటల పటాటోపంతో ఊగిపోతుంటారు. చేతల్లో మాత్రం వారు ఎంత అల్పులో పదేపదే నిరూపించుకుంటూ ఉంటారు. కరోనా విషాదకాలంలో మన దేశం ఆపత్కాల పరిస్థితులలో వృద్ధుల్ని ఆదుకోవడానికి ఎంత సిద్ధంగా ఉందో అర్థమైంది. ఆ సమయంలో మృత్యువాత పడిన వారిలో వృద్ధులే అధికులు. కేవలం ఏదో మహమ్మారి ప్రబలినప్పుడే కాదు అంటురోగాలు కాకుండా ఇతర వ్యాధులు సోకిన సందర్భాలలో కూడా వృద్ధులలో మరణం రేటు అధికంగా ఉంటుంది. ఇది మన దేశంలో ఆరోగ్య వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో తెలియజేస్తుందని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన ఒక సంస్థ చేసిన పరిశోధన ద్వారా అర్థమవుతుంది.
పెరుగుతున్న వృద్ధుల సంఖ్యకు అనుగుణంగా వృద్ధులకు అవసరమైన వైద్య ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సి ఉంది. నగరాల్లో, పట్టణాల్లో ఉన్న ఆసుపత్రుల మీద అధిక భారం పడకుండా గ్రామాలలో, మండల కేంద్రాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంతగానో పొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మన భారతదేశం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్యలో, ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్యలో ప్రపంచ ఇండెక్స్ లో చాలా అడుగున ఉంది. పెరుగుతున్న వృద్ధుల సంఖ్యను గమనంలో ఉంచుకొని దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు నడవాల్సి ఉంది. వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నామని మన ప్రభుత్వాలు, పాలకులు గొప్పలు చెప్పుకుంటారు, నెలకోసారి ఇచ్చే పెన్షన్ కాదు, వారు జీవితకాలం ఆరోగ్యంగా ఉండే భరోసా కల్పించినప్పుడే అది అసలైన పెన్షన్ అవుతుంది. దాన్నే అసలు సిసలు ఆసరా అని మనం అనొచ్చు. లేదంటే రానున్న కాలంలో వృద్ధులు మన ఆనందం కంటే మన విషాదానికి ఎక్కువ కారణం కాగలరు. ఈ విషయంలో మందగించక ముందుకడుగేయ్.. వెనకబడితే వెనకేనోయ్ అన్న మహాకవి గురజాడ మాటలు మరోసారి గుర్తు చేసుకోవాలి. వృద్ధ భారతానికి వందనం. అలాగే ఆ వృద్ధులను ఆనందంగా ఉంచే సన్నద్ధ భారతానికి కూడా ఆశాభావంతో ఆహ్వానం పలుకుదాం.
Also Read: Elections- 8 Apps : ఎన్నికల సమరానికి 8 యాప్‌లు.. 3 పోర్టల్స్ ఇవిగో