Neelavancha : సాహసాలకు పెట్టింది పేరు ఆ పల్లెటూరు..రోజుకోసారైనా ఎక్కాల్సిందే..!!
Neelavancha : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా ఈ గ్రామంలో ఇప్పటికీ సెల్ ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో లేవు
- By Sudheer Published Date - 07:03 PM, Fri - 7 February 25

ప్రపంచం టెక్నాలజీతో దూసుకుపోతున్నప్పటికీ, ఇంకా కొన్ని ప్రాంతాలు ప్రాథమిక సౌకర్యాలకే దూరంగా ఉన్నాయి. రోడ్లు , కనీస అవసరాలు చివరకు ఫోన్ సిగ్నల్ లు లేని పల్లెలు కూడా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని నేలవంచ గ్రామం (Neelavancha Village) కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా ఈ గ్రామంలో ఇప్పటికీ సెల్ ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో లేవు. దీంతో గ్రామస్తులు రోజూ సిగ్నల్స్ కోసం కొండలు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
Vision-2047 : విజన్-2047కు సహకరించండి – చంద్రబాబు
ఈ కాలంలో సెల్‌ఫోన్ ఒక నిత్యావసరంగా మారింది. సెకన్లలో సమాచారాన్ని అందించాల్సిన 5జీ నెట్‌వర్క్ ప్రపంచాన్ని శాసిస్తున్న వేళ, నేలవంచ గ్రామస్తులు మాత్రం ప్రాథమిక కమ్యూనికేషన్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామంలో కొంతమంది మాత్రమే సెల్‌ఫోన్ వాడుతున్నారు. అది కూడా నెలకోసారి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు మాత్రమే. ఫోన్ సిగ్నల్ కోసం గ్రామస్తులు వాటర్ ట్యాంక్‌లు, కొండలు ఎక్కాల్సిన పరిస్థితి. నెలవంచ గ్రామం ఆదివాసీ గిరిజనుల నివాస ప్రాంతం. సుమారు 200 మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో కనీస మౌలిక వసతులు లేవు. కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అత్యవసర సమయాల్లో, పాము కరిచినా, తేలు కరిచినా, దగ్గరలో ఫోన్ సిగ్నల్ లేకపోవడంతో వైద్య సహాయం అందక విలవిల్లాడుతున్నారు. కాలినడకన మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. సిగ్నల్ సమస్య మాత్రమే కాదు, ప్రభుత్వం అందించే పింఛన్, రేషన్ వంటి సంక్షేమ పథకాలను పొందడానికి కూడా గ్రామస్తులు నానా అవస్థలు పడుతుంటారు. ఆధార్ కార్డుల వంటి ప్రాథమిక డాక్యుమెంట్లు పొందడానికే కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితి. గ్రామస్థుల ఇబ్బందులను అధికారులు పట్టించుకోవడం లేదని, దీనికి శాశ్వత పరిష్కారం కావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నెలవంచ గ్రామ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వము, టెలికాం సంస్థలు చొరవ తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. సెల్ టవర్ ఏర్పాటు చేసి, కనీస కమ్యూనికేషన్ సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని వారు కోరుతున్నారు.