CM Joseph Vijay: మీ విజయ్ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్
- Author : Vamsi Chowdary Korata
Date : 10-05-2026 - 11:55 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళనాడులో నిజమైన లౌకిక, సామాజిక న్యాయంతో కూడిన కొత్త శకం ప్రారంభమైందని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ అన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. “యువత నాకు అండగా నిలిచింది. ఈ విజయ్ ‘మామ’ మీకు అన్నివిధాలా మంచి చేస్తాడు. మీరే నా ప్రాణం” అని ముఖ్యమంత్రి తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు.
నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడినని, అన్నలా, తమ్ముడిలా ఉంటానని హామీ ఇచ్చారు. నేను మీ అందరివాడినని వ్యాఖ్యానించారు. తనకు ఓటు వేసి గెలిపించినందుకు యావత్ తమిళ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు.
హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ముఖమే విజయ్ ముఖమని వ్యాఖ్యానించారు. టీవీకే కార్యకర్తలు లేకుంటే తాను ఇక్కడ లేనని విజయ్ అన్నారు. ఎవరికీ తెలియకుండా చీకటి రాజకీయాలు చేయబోనని, ఏది ఉన్నా నేరుగా మాట్లాడుతానని తెలిపారు. అన్నీ నేర్చుకోవడానికి తనకు సమయం ఇవ్వాలని కోరారు. తన ప్రభుత్వంలో ఒకటే పవర్ సెంటర్ ఉంటుందని హామీ ఇచ్చారు. మహిళలను కాపాడటమే తమ ప్రభుత్వం లక్ష్యమని అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని వెల్లడించారు. తనకు ఆకలి, పేదరికం తెలుసునని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి వస్తే మేం చూసుకుంటామని ప్రజలు తనను ప్రేమగా పిలిచారని అన్నారు. నేను దేవదూతనేమీ కాదని సాధారణ కుటుంబం నుంచే వచ్చానని పేర్కొన్నారు. ఆలోచిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పమని హామీ ఇచ్చారు. ఏది సాధ్యమో అదే చేస్తామని అన్నారు.