PK Vs Dhoni : ధోనీని దాటేస్తా.. విజయ్‌ను గెలిపిస్తా.. ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడులో మేం కొత్త చరిత్రను సృష్టిస్తామని టీవీకే అధినేత, నటుడు విజయ్(PK Vs Dhoni) అన్నారు.
- By Pasha Published Date - 04:00 PM, Wed - 26 February 25

PK Vs Dhoni : మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి తన అసలైన పనిలో యాక్టివేట్ అయ్యారు. తమిళనాడుకు చెందిన నటుడు విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీకి స్పెషల్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తానని ప్రకటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేను గెలిపించి తీరుతానని పీకే వెల్లడించారు. ‘‘వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో టీవీకేను గెలిపించడం ద్వారా తమిళనాడులో నా తోటి బిహారీ ధోనీని పాపులారిటీలో దాటేస్తాను’’ అని ఆయన తెలిపారు. బుధవారం చెన్నైలో జరిగిన టీవీకే తొలి వార్షికోత్సవాల్లో ఆయన ఈ కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపైనా పీకే విరుచుకుపడ్డారు. గుజరాత్ మోడల్ కంటే తమిళనాడు మోడలే దేశానికి ఆదర్శప్రాయంగా ఉంటుందన్నారు. దేశంలోని 20 శాతం మంది ప్రజలు భయం, ఆందోళనలో ఉంటే, ప్రధానమంత్రి మోడీ చెబుతున్న వికసిత భారత్ ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. తమిళనాడు ప్రజలు ఎన్నడూ మతతత్వాన్ని సమర్ధించలేదని తెలిపారు.
Also Read :MLC Vote : ‘ఎమ్మెల్సీ’ ఓటు వేయబోతున్నారా ? ఇవి తప్పకుండా తెలుసుకోండి
విజయ్ ఏమన్నారంటే..
తమిళనాడులో మేం కొత్త చరిత్రను సృష్టిస్తామని టీవీకే అధినేత, నటుడు విజయ్(PK Vs Dhoni) అన్నారు. 1967, 1977 తరహా ఎన్నికల ఫలితాలను 2026లో రిపీట్ చేస్తామన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ, శాశ్వత మిత్రులు కానీ ఉండరని స్పష్టం చేశారు. దీన్నిబట్టి భవిష్యత్తులో టీవీకే ఏ పార్టీతోనైనా చేతులు కలిపే అవకాశాలు ఉంటాయని తేల్చి చెప్పారు. ‘గెట్ ఔట్ బీజేపీ, డీఎంకే’ హ్యాష్ ట్యాగ్ ప్రచారాన్ని, ‘హ్యాష్ ట్యాగ్ గెట్ ఔట్’ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈసందర్భంగా విజయ్ ప్రారంభించారు. తమిళనాడు ప్రజల డిమాండ్లను నెరవేర్చనందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం నుంచి తప్పుకోవాలని ఆయన కోరారు. అసలు సమస్యల నుంచి తమిళనాడు ప్రజల చూపును మరల్చేందుకే బీజేపీ, డీఎంకేలు విమర్శలతో టైం పాస్ చేస్తున్నాయని విజయ్ మండిపడ్డారు. ‘త్రిభాషా సూత్రం అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నపిల్లల్లా కొట్లాడుకుంటున్నాయి’’ అని ఆయన ఎద్దేవా చేశారు. తమిళనాడు ప్రజలు కోరుకుంటున్న మార్పుకు పునాది వేసే సత్తా కలిగిన పార్టీ తమదేనని టీవీకే అధినేత చెప్పారు.