జయ ఎస్టేట్ రహస్యాలపై సీఎం స్టాలిన్ కన్ను..మరణం, మర్డర్లపై పునర్విచారణకు ఆదేశం
- Author : Dinesh Akula
Date : 22-10-2021 - 3:15 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చురుగ్గా ముందుకు కదులుతున్నారు. ఆ మేరకు మాజీ సీఎం జయలలిత మరణం..ఆమె ఎస్టేట్ రహస్యాలను తోడేందుకు పునర్విచరణకు ఆదేశించాడు. అందులో భాగంగా ఆమె డ్రైవర్ కనగరాజ్ రోడ్డు ప్రమాదంపై తొలుత విచారణను ముగించాలని డైరెక్షన్ ఇచ్చాడు. జయ మరణం వెనుకున్న నిజాలను బయటపెట్టాలని చాలా మంది నాడు డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న అన్నా డీఎంకే ప్రభుత్వం తూతూ మంత్రంగా విచారణ చేపట్టిందని తమిళనాట అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. ఫళీనీస్వామి, పన్నీరు సెల్వంలు ముఖ్యమంత్రులుగా చేసినప్పటికీ జయ మరణం వెనుక రహస్యాలను పూర్తిగా నిగ్గుతేల్చలేకపోయారు.
చెన్నై అపోలో ఆస్పత్రిలో జయలలిత మరణించిన కొన్ని నెలల పాటు పలు రకాల పరిణామాలు పోయెస్ గార్డెన్ చుట్టూ చోటుచేసుకున్నాయి. కొంత కాలం ఎస్టేట్ లోకి వెళ్ల కుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. స్నేహితురాలు శశికళ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నం చేసి తొలి రోజుల్లో విఫలం అయింది. కొంతర కాలానికి శశికళ కూడా జైలు పాలయ్యారు. ఆ సమయంలో కోడనాడ్ ఎస్టేట్ లోపలకు వెళ్లడానికి కొందరు ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఎస్టేట్ 10వ గేటు వద్ద కాపలా ఉండే గార్డ్ ఓంబహుదూర్ ను హత్య చేశారు. ఆ కేసులో ప్రధాన నిందితుడుగా జయ కారు డ్రైవర్ కనగరాజ్ ఉన్నాడు. కొన్ని రోజులకు అతను మోటారు బైక్ పై వెళుతూ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్పీడ్ గా వస్తోన్న కారు ఢీ కొనడంతో మరణించాడని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

కానీ, కనగరాజ్ కుటుంబీకులు, బంధువులు మాత్రం మర్డర్ గా అనుమానించారు. ఆ మేరకు ఫిర్యాదు కూడా చేశారు. ఇదే కేసులో మరో నిందితుడు సాయెన్ కేరళ లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రమైన గాయాలతో బయటపడ్డాడు. ఇతను జయ ఉన్నప్పుడు ఎస్టేట్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసేవాడు. ఇవన్నీ 2017లో జరిగిన సంఘటనలు. ఈ కేసుల దర్యాప్తు మాత్రం అన్నా డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు వేగంగా జరగలేదు. మిస్టరీగా మారిన జయ ఎస్టేట్ వ్యవహారంపై నిజాలను బయట పెడతామని డీఎంకే 2021 ఎన్నికల్లో హామీ ఇచ్చింది. పలు సభల్లో స్టాలిన్ ప్రామిస్ చేశాడు. ఆ మేరకు ఇప్పుడు జయ బంగ్లా వెనుకున్న రహస్యాలను బయటపెట్టడానికి కేసును మళ్లీ దర్యాప్తు చేయడానికి ఆదేశించాడు. స్టాలిన్ గట్స్ ను గమనిస్తోన్న తమిళనాడు ప్రజలు ఖచ్చితంగా ఈసారి జయ మరణం, ఎస్టేట్ రహస్యాలు అన్నీ బయటకు వస్తాయని విశ్వసిస్తున్నారు. మరి స్టాలిన్ ఏమి చేస్తాడో చూద్దాం.