Sumalatha – BJP : ‘మాండ్య’ను త్యాగం చేసిన సుమలత.. బీజేపీలోకి చేరిక
Sumalatha - BJP : ప్రముఖ నటి సుమలత కీలక నిర్ణయం తీసుకున్నారు.
- By Pasha Published Date - 02:55 PM, Wed - 3 April 24

Sumalatha – BJP : ప్రముఖ నటి సుమలత కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తాను ఇండిపెండెంట్ ఎంపీగా ఉన్న కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ స్థానాన్ని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామికి ఆమె వదిలేశారు. గత ఎన్నికల్లో ఎంతో కష్టపడి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెల్చిన మాండ్య స్థానం నుంచి ఈసారి పోటీ చేయొద్దని సుమలత నిర్ణయించుకున్నారు. తాను బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. బీజేపీ-జేడీఎస్ మధ్య జరిగిన సీట్ల సర్దుబాటులో భాగంగా తాను మాండ్య స్థానాన్ని వదిలేశానని ఆమె తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
బుధవారం మాండ్యలోని కాళికాంబ ఆలయంలో జరిగిన తన మద్దతుదారుల సమావేశంలో సుమలత అంబరీష్(Sumalatha – BJP) ఈ వివరాలను వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేయకున్నా.. మాండ్యా ప్రజలను తాను వదిలిపెట్టనని తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. బీజేపీ – జేడీఎస్ కూటమి తరఫున చిక్కబళ్లాపూర్, బెంగళూరు నార్త్, మైసూర్ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని తనను కోరారని.. అయితే ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సుమలత చెప్పారు. మాండ్యాకు దూరంగా ఉండటం ఇష్టంలేకే వాటిని వద్దనుకున్నట్లు తెలిపారు.
Also Read :Rupay Card New Features : ‘రూపే’ కార్డులో మూడు కొత్త ఫీచర్లు.. ఇవిగో
‘‘మాండ్య నా స్వస్థలం. ఇక్కడి ప్రజల ప్రేమను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. రాబోయే రోజుల్లోనూ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తాను’’ అని సుమలత అన్నారు. కర్ణాటక రాష్ట్ర బీజేపీ అగ్రనేతలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఎంపీ సుమలత తనయుడు అభిషేక్ అంబరీష్, నటుడు దర్శన్ పాల్గొన్నారు. కాగా, 2019లో మాండ్యాలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థిగా హెచ్‌డీ కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సుమలత గెలిచారు.