Free Bus To Women: ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఉచిత ప్రయాణమే కాకుండా ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కృషి చేస్తామని పంకజ్ సింగ్ చెప్పారు.
- By Gopichand Published Date - 12:56 PM, Sat - 22 February 25

Free Bus To Women: ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై (Free Bus To Women) చాలా ఊహాగానాలు వచ్చాయి. అధికారం మారిన తర్వాత ఈ పథకం ఆగిపోతుందని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. అయితే ఢిల్లీ కొత్త రవాణా మంత్రి పంకజ్ సింగ్ ఈ ఊహాగానాలను పూర్తిగా తోసిపుచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని నిలిపివేస్తారని ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ధీమా వ్యక్తం చేసింది. కానీ, కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ సౌకర్యం కొనసాగుతుందని, పథకాన్ని మరింత మెరుగుపరుస్తామని మహిళలకు ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. రవాణా మంత్రి పంకజ్ సింగ్ గురువారం ప్రకటన చేస్తూ.. ప్రజా రవాణాను మెరుగుపరచడానికి, అందుబాటులోకి తీసుకురావడానికి మేము కట్టుబడి ఉన్నాము. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మునుపటిలా కొనసాగుతుందని పేర్కొన్నారు.
Also Read: Lakshmi Devi: లక్ష్మీదేవికి ఇలా పూజ చేస్తే చాలు.. అమ్మవారు ఇంట్లో తిష్ట వేయాల్సిందే!
రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయి
ఉచిత ప్రయాణమే కాకుండా ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కృషి చేస్తామని పంకజ్ సింగ్ చెప్పారు. ఇందుకోసం ఎన్ని బస్సులు, వాటి పరిస్థితి, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని రవాణాశాఖకు ఆదేశాలు జారీ చేశారు.
100 రోజుల్లో మార్పు కనిపిస్తుందా?
ఢిల్లీ ప్రభుత్వం రవాణాపైనే కాకుండా ఆరోగ్య సదుపాయాలపై కూడా పనిని ముమ్మరం చేసింది. మొహల్లా క్లినిక్‌ల ప్రస్తుత స్థితిగతులపై నివేదిక కోరినట్లు మంత్రి తెలిపారు. చాలా క్లినిక్‌లు సక్రమంగా పనిచేయడం లేదని, అవినీతికి పాల్పడే అవకాశం ఉందన్నారు. ‘మేము ఆరోగ్య శాఖ నుండి నివేదిక కోరాం. 100 రోజుల్లో కనిపించే మార్పులు కనిపిస్తాయి’ అని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత ఫైలును కేంద్రానికి పంపించామని, ఇప్పుడు అది తిరిగి వచ్చిందని మంత్రి తెలిపారు. వీలైనంత త్వరగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.